సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 31 వస్తుందంటే చాలు.. పార్టీలపైనే చర్చ. స్నేహితులు, బంధువులు అందరూ కలిసి వేడుక చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే చాలా వరకు డిసెంబర్ 31 పార్టీని దారుతోనే సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే దారు లేకుండా పార్టీ చేసుకోవాలని ‘దావత్ వితౌట్ దారు’ టీం సభ్యులు సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. మద్యం తాగి చేసుకునే వేడుక ఎప్పటికీ మంచిది కాదనీ.. మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా ఫౌండర్ చెగొండి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మద్యం లేకుండా పార్టీ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని.. దారు లేకుండా జరిపే పార్టీల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని వివరించారు. రాబోయే డిసెంబర్ 31 వేడుకల్లో మద్యం సేవించి ఇబ్బందులు ఎదుర్కోవద్దని హితవు పలికారు. కాగా, ‘దావత్ వితౌట్ దారు’ టీం సభ్యులు దావత్ వితౌట్ దారుపై ప్రజలకు అవగాహన సైతం కల్పిస్తుండటం విశేషం.