సిటీబ్యూరో, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : వయసు రీత్యా వచ్చే రుగ్మతలపై సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ దృష్టి సారించింది. అల్జీమర్స్, కంటిచూపు లోపాలతోపాటు, వినికిడి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. శరీరంలో కొత్త కణాల పునర్జీవం, కణాల అభివృద్ధిలో వచ్చే సమస్యలను పరిశీలించనున్నారు. ఈ అధ్యయనం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల నివారణ, శరీర జీవక్రియలను ప్రభావితం చేసే అంశాలను తెలుసుకునేందుకు వీలు ఉంటుందని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక సమస్యలు, రుగ్మతలను అంచనా వేసేందుకు సీసీఎంబీ కణాల పనితీరు, జీవక్రియలను అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా జన్యువుల్లో ఉండే అతి ముఖ్యమైన ప్రోటీన్లను విశ్లేషించనున్నారు.
65ఏళ్లు దాటిన తర్వాత సర్వసాధారణంగా వచ్చే మతిమరుపు, పెర్కిన్సన్తోపాటు కంటిచూపు, వినికిడి వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం స్వస్తి రాయచౌదరి బృందం ప్రయోగశాలలో పెంచిన ఎలుకల మెదడులో కొత్త కణాలను ప్రవేశపెట్టి… నాడీ కణాల పనితీరును అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాడీకణంలోని జీవక్రియలు, వాటి శరీరంలో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తుండగా, ఆధునిక సాంకేతికతను ఈ పరిశోధనకు వినియోగిస్తున్నట్లుగా తెలిసింది. ప్రయోగ ఫలితాలను బట్టి భవిష్యత్తులో వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల నియంత్రణకు అవసరమైన జీవక్రియ మార్పులు, చికిత్స విధానాలను రూపొందించడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు.