సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నందున క్యాన్సర్ కేర్ అవసరం ఎంతో ఉందని.. ప్రతి నర్సింగ్ కాలేజీలో ‘క్యాన్సర్ నర్సింగ్’ను ఒక సబ్స్పెషాలిటీగా చేర్చి శిక్షణ ఇవ్వాలని కిమ్స్-ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ కేంద్రం సంచాలకుడు డాక్టర్ పి.రఘురామ్ గవర్నర్ డాక్టర్ తమిళి సైని కోరారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో హెల్త్‌కేర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతపై గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న రఘురామ్ మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్లో 157 నర్సింగ్ స్కూళ్లను కేటాయించడాన్ని స్వాగతించారు. హెల్త్‌కేర్‌లో నర్సుల పాత్ర చాలా కీలకమైనదని, అది వైద్యరంగానికి ఒక నాడీ కేంద్రంగా పనిచేస్తుందని కొనియాడారు. యూకేలో ప్రతి నర్సింగ్ స్కూల్లో ‘క్యాన్సర్ నర్సింగ్’ అనే అంశాన్ని ఒక సబ్‌స్పెషాలిటీ కింద తీసుకొని శిక్షణ ఇస్తారని వివరించారు. గ్రామీణ భారతంలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరగా.. ఇందుకు స్పందించిన గవర్నర్ రొమ్ము క్యాన్సర్‌పై డాక్టర్ రాఘురామ్ చేస్తున్న పోరాటం, అవగాహన కల్పిస్తున్న తీరు అభినందనీయమన్నారు.