వనస్థలిపురం, సెప్టెంబర్ 27: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మండిపడ్డారు. సోమవారం హయత్‌నగర్‌లో భారత్ బంద్‌లో పాల్గొన్న నాయకులను అరెస్టు చేసిన పోలీసులు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ రంగసంస్థలను అమ్ముతూ.. కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయాన్ని కూడా బడా కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. నల్ల చట్టాలను రద్దుచేసే వరకు అఖిల పక్షాల పోరాటం కొనసాగుతుందన్నారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకుడు రవీంద్రాచారి, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి మల్రెడ్డి రామ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.