మహేశ్వరంలోనే ఏఐ సిటీ!
కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్) ప్రపంచ పోకడనే మార్చివేస్తోంది. ఐటీ రంగంలోనే కాదు ప్రతి రంగంతోనూ ఏఐ పెనవేసుకుంటోంది.మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్కా ఏఐ చేసేస్తోంది. ఇది ఒక రకంగా ప్రమాదకరమని తెలిసినా.. దాని వెంటే ప్రపంచమంతా నడుస్తోంది.
- అనేక సానుకూలంశాలే కారణం
- ఔటర్తో అనుసంధానం..
- సమీపంలో విమానాశ్రయం
- అనువైన స్థలాల పరిశీలన
సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్) ప్రపంచ పోకడనే మార్చివేస్తోంది. ఐటీ రంగంలోనే కాదు ప్రతి రంగంతోనూ ఏఐ పెనవేసుకుంటోంది.మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్కా ఏఐ చేసేస్తోంది. ఇది ఒక రకంగా ప్రమాదకరమని తెలిసినా.. దాని వెంటే ప్రపంచమంతా నడుస్తోంది. అందుకు ఉదాహరణ… గూగుల్, మైక్రోసాఫ్ట్, మేటా వంటి కంపెనీలు ఏఐ టెక్నాలజీతోనే రకరకాల అప్లికేషన్, సెర్చ్ ఇంజన్లను రూపొందిస్తున్నారు. ఇక ఇతర కంపెనీలు ఏఐ టూల్స్ పేరుతో ప్రతి పనికి ఓ ఏఐ టూల్స్ అన్నట్లు రూపొందించి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అలాంటి కృత్రిమ మేథస్సు ప్రాధాన్యతను గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గుర్తించి.. ప్రత్యేకంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను, అదేవిధంగా తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఎయిమ్) పేరుతో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా రోజు రోజుకు ఏఐ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఏఐకి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. పరిశ్రమల కోసం ఏర్పాటు చేసే సెజ్ తరహాలోనే ఏఐ సిటీని సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది.
అనుకూలంగా మహేశ్వరం..
కొత్తగా ఏర్పాటు చేసే ఏఐ సిటీని నగరంలో ఐటీ కారిడార్‌గా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కాకుండా మరో చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో రద్దీ గణనీయంగా పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఏఐ కోసం ప్రత్యేకంగా ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఔటర్ రింగు రోడ్డు వెంబడి విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు, మూడు ప్రాంతాలను అనుకున్నా, అందులో మహేశ్వరం అయితేనే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయానికి ఐటీ శాఖ అధికారులు వచ్చారు. ఓఆర్ఆర్తో అనుసంధానంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, ప్రస్తుతం మహేశ్వరం చుట్టు పక్కల ప్రాంతాల్లో నివాసం, పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి దారి తీసి, ఆ చుట్టు ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి కేవలం 4-5 కి.మీ పరిధిలో, ఎయిర్‌పోర్టు నుంచి 15 కి.మీ పరిధిలోనే ఉండేలా స్థలాలను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ వేలాది ఎకరాలు అందుబాటులో ఉండటంతో అక్కడ సైతం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తం మహేశ్వరం చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఏఐ సిటీ ఏర్పాటుకు ఎంతో అనుకూలమనే అభిప్రాయాన్ని ప్రభుత్వంతో పాటు ఐటీ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
జూలైలో గ్లోబల్ ఏఐ సమ్మిట్..
ఐటీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఒకటైన కృతిమ మేథస్సుపై ప్రత్యేకంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించాలని షెడ్యూలును ఖరారు చేసింది. జూలైలో అంతర్జాతీయ స్థాయిలో ఏఐ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ఆ సమయానికి కల్లా ఏఐ సిటీకి సంబంధించిన స్థలాన్ని ఎంపిక చేయడంతో పాటు అక్కడ నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఐటీ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ద్వారా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఏఐ నిపుణులు పుష్కలంగా అందుబాటులో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ స్పెషలైజేషన్‌లో కోర్సులు ఉన్నాయి. ఫలితంగా ఏఐలో నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత ఇక్కడ ఉండటంతో ఏఐ సిటీకి ఎంతో భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

