‘మత్తు’పై పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నారు. గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం సైతం వివిధ చోట్ల గంజాయి, హశీశ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని.. నిందితులను అరెస్టు చేశారు.
బాలానగర్, అక్టోబర్ 29 : హశీశ్ ఆయిల్(గంజాయి నూనె)ను అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్‌కిరణ్ తన సిబ్బందితో కలిసి కూకట్పల్లి ఐడీఎల్ చెరువు, నిజాంపేట ప్రాంతాల్లో దాడులు చేశారు. ఐడీఎల్ చెరువు వద్ద ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమామహేశ్ (20) బాలకృష్ణ (21) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 60 గ్రాములు, నిజాంపేటలోని దుర్గాప్రసాద్ (25) వద్ద 140 గ్రాముల గంజాయి నూనెను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
కాచిగూడ,అక్టోబర్ 29: చాదర్‌ఘాట్ మూసీలో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో కాచిగూడ ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి అక్కడికి చేరుకొని పరిశీలించారు. శంకర్‌నగర్ సమీపంలో గంజాయి మొక్కను గుర్తించి.. ధ్వంసం చేశారు. ఎక్కడి నుంచో గింజ కొట్టుకుని వచ్చి..మొక్కగా మొలిచిందని, ఆ ప్రాంతంలో గంజాయిని ఎవరూ విక్రయించడంలేదని పోలీసులు తెలిపారు.