మాదాపూర్, జూన్ 7: డేటింగ్ యాప్ పేరుతో యువతులు అబ్బాయిలకు వలవేస్తున్నారు. ఎంపిక చేసుకున్న పబ్‌లకు యువకులను తీసుకెళ్తున్నారు. యువతులతో పబ్ నిర్వాహకులు కూడా కలిసిపోతున్నారు. యువతులు, పబ్ నిర్వాహకులు కలిసి యువకులను నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్సై ఎన్వీ రమణ కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని మోష్ పబ్ యాజమాన్యం యువతులను అడ్డం పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు కొంతమంది యువతులను ఎంపిక చేసుకున్నారు. ఆ యువతులు డేటింగ్ యాప్ ద్వారా యువకులను పరిచయం చేసుకుంటారు. పరిచయమైన యువకులను ఆ యువతులు పబ్‌కు తీసుకొస్తారు. యువకులను మత్తులో ముంచేసి.. అధిక బిల్లులు వేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో యువతుల సహాయంతో పబ్ చేస్తున్న మోసం బయటపడింది. ఓ యువకుడికి టిండర్ యాప్ ద్వారా రితిక అనే యువతి పరిచయమైంది.
వారిద్దరూ హైటెక్ సిటీ వద్ద కలుసుకున్నారు. రోడ్డుపైన ఏం మాట్లాడుదామంటూ ఆ యువకుడిని పబ్‌కు తీసుకెళ్లింది. హైటెక్ సిటీలోని మోష్ పబ్‌కు తీసుకువెళ్లి ఖరీదైన లిక్కర్ ఆర్డర్ చేసింది. ఆ తరువాత పబ్ యజమానులు ఆ యువతికి కోక్ ఇచ్చి.. అసలు బిల్లు కంటే ఎక్కువ (రూ. 45 వేలు) బిల్లును వేసి యువకుడి చేతిలో పెట్టారు. ఆ సమయంలో యువతి హ్యాపీగా నడుచుకుంటూ.. పబ్ నుంచి వెళ్లిపోయింది. అవాక్కయిన ఆ యువకుడు ఇంత బిల్లు ఎలా అయ్యిందని పబ్ యజమానిని ప్రశ్నించాడు. అయితే పబ్ నిర్వాహకులు బెదిరించి బిల్లులను కట్టిస్తున్నారని.. బాధిత యువకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఆన్లైన్ ద్వారా పబ్ రివ్యూలను పరిశీలించాడు. ఇప్పటి వరకు చాలా మందిని ఇలాగే మోసం చేసినట్టు రివ్యూల ద్వారా బాధితుడు గుర్తించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన సదరు యువకుడు.. లిక్కర్ పేరుతో యువతికి కోక్ ఇచ్చి రూ.45 వేల బిల్లు వేశారని పేర్కొంటూ, అతడికి జరిగిన మోసాన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అదేవిధంగా.. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా పబ్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుమోటోగా తీసుకొని కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.