కవాడిగూడ, జనవరి 2: నాడి చూసి చికిత్స చేయడం ఆక్యుపంక్చర్ ప్రత్యేకత అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కవాడిగూడ గోషాలలో కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్ న్యాచురోపతి(సియాన్) వ్యవస్థాపకుడు డాక్టర్ సుధాకర్, డైరెక్టర్ జ్యోతిల సహకారంతో డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెన్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఆక్యుపంక్చర్ చికిత్స విధానాన్ని బాధితులు ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను నయం చేసుకోవాలని అన్నారు. సియాన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సుధాకర్, డైరెక్టర్ జ్యోతిలు మాట్లాడుతూ.. ఆక్యుపంక్చర్ విధానం ద్వారా నాడిచూసి వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స చేయడం జరుగుతుందని, శరీరంలో ప్రవహించే ప్రాణశక్తిని సమన్వయం చేయడమే ఈ చికిత్స అని అన్నారు. శరీరానికి తనకు తానుగా బాగుచేసుకునే గొప్ప శక్తి ఉందని అన్నారు. శరీరంలో ప్రాణశక్తి ప్రవహిస్తుంటే బాధకాని జబ్బులు కాని ఉండవని అన్నారు. శక్తి ప్రవాహంతోని హెచ్చుతగ్గులు ఆక్యుపంక్చర్ చికిత్స ద్వారా బ్యాలన్స్ అవుతుందని అన్నారు. అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో గత 4 ఏండ్ల నుంచి ఒక సమగ్రమైన ఆక్యూపంక్షర్ వైద్య విద్య సంస్థను నిర్వహిస్తున్నామని అన్నారు. మందులు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ చికిత్స ఉంటుందని అన్నారు. అన్ని రోగాలను ఈ చికిత్స ద్వారా నయం చేయవచ్చని అన్నారు. ఈ వైద్య శిబిరంలో 35 మంది వైద్యులు దాదాపు 400 మంది బాధితులకు చికిత్సను అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, సియాన్ డైరెక్టర్లు పీఎల్కే దుర్గ, చిదంబరం, శ్రీధర్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు సలంద్రి శ్రీనివాస్ యాదవ్, జుగేందర్, రాములు తదితర వైద్యులు పాల్గొన్నారు.