సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ): రాజధానిలో ఓటర్ల సంఖ్య భారీగా తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో ప్రక్రియలో ప్రధాన ఘట్టం ఈ నెల 7వ తేదీతో ముగిసింది. కొత్త ఓటర్లుగా నమోదు, ఓటరు జాబితాలోని పేర్ల తొలగింపు, ఓటరు వివరాల్లో సవరణలు చేసేందుకు సంబంధించిన ఫారం-6, ఫారం-7, ఫారం 8 దరఖాస్తులను సమర్పణకు సంబంధించి తుది గడువు బుధవారంతో ముగిసింది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిధి 28 నియోజకవర్గాల్లో 1.14 కోట్ల ఓటర్ల సంఖ్య 71 లక్షలకు తగ్గింది. అంటే దాదాపు 43 లక్షల ఓట్లు ఏఎస్డీ ఓటర్లు( ఏ-లేనివారు, ఎస్-వలస వెళ్లినవారు, డీ-మరణించినవారు), ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వని వారివి కలిపి ఓట్లు రద్దు జాబితాలో చేర్చారు.
ఇందులో ఎన్నికల అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందించి కేవలం 2, 78,216 ఓటర్లు మాత్రమే తమ ఓటు తొలగించవద్దని ైక్లెయిమ్ చేసుకున్నారు. అంటే వీరి పేరు ఓటరు జాబితాలో చేరితే దాదాపు 40.21 లక్షల మంది తమ ఓటు కోల్పోనున్నారు. అయితే క్లెయిమ్స్, అభ్యంతరాలన్నింటినీ నవంబర్ 5లోగా పరిషరించాల్సి ఉంది. పరిశీలన అనంతరం అర్హులైన ఓటర్లను తుది జాబితాలో కొనసాగించడంతోపాటు నిబంధనలకు అనుగుణంగా లేని పేర్లపై నవంబరు 9న తుది జాబితాలో నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా రాజధాని పరిధిలో 40.21 లక్షల ఓటర్ల భవితవ్యం తుది ఓటరు జాబితాలో తేలనున్నది.

టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజవర్గాలు
ఈ ఏడాది జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన సర్ ప్రక్రియను పరిశీలిస్తే భారీగా ఓటర్ల సంఖ్య తగ్గగా.. అత్యధికంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గెలుపొందిన నియోజకవర్గాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శేరిలింగంపల్లిలో 3, 29, 828, కుత్బుల్లాపూర్లో 2, 76, 924, ఎల్బీనగర్లో 2, 70, 284, రాజేంద్రనగర్లో 2, 47, 005, మహేశ్వరం లో 2, 35, 331 ఓట్లు తొలగింపు జాబితాలో ఉండడం, గోషామహల్, ముషీరాబాద్, ఎల్బీనగర్లో ఫారం-7 కింద బీజేపీ బీఎల్ఏ భారీగా ఓట్లను తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది.
ఆ పార్టీ నేతలు పలుసార్లు సర్ అవకతవకలపై ఫిర్యాదులు సైతం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్కు నష్టం జరిగేలా కుట్రలు చేసి ఓట్లను తొలగించినట్లు తాజా జాబితా ద్వారా తేటతెల్లమైనట్లు చెబుతున్నారు. సర్ పేరిట గ్రేటర్లో బీఆర్ఎస్ను బలహీనపరచాలని పన్నుతున్న కుట్రలకు ఓటర్లు బలమైన సమాధానం చెప్తారని స్పష్టంచేస్తున్నారు. ఈసీ అధికార పార్టీలకు కొమ్ముకాయకుండా సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
