ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 01, 2020 , 04:22:59

జాబ్‌ కనెక్ట్‌తో 12వేల మందికి ఉపాధి

జాబ్‌ కనెక్ట్‌తో 12వేల మందికి ఉపాధి
  • పోలీసు శాఖ ఆధ్వర్యంలో నాలుగేండ్లుగా ఉద్యోగ మేళాలు
  • కాచిగూడ జాబ్‌మేళాలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

కాచిగూడ: తూర్పు మండలం డీసీపీ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ నాన్‌ టెక్నికల్‌ నిరుద్యోగుల కోసం శనివారం కాచిగూడలోని వైశ్యహాస్టల్‌లో 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌ మేళా నిర్వహించారు.  దీనికి విశేష స్పందన వచ్చింది. 2500 నిరుద్యోగుల కోసం పేరొందిన.. విప్రో, సైటల్‌, నోవాటెల్‌, జన్‌ప్యాక్‌, క్యూ కనెక్ట్‌లతో పాటు 20 కంపెనీల ప్రతినిధులు వచ్చారు.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. నాలుగేండ్లలో నిరుద్యోగులకు 12వేల ఉద్యోగాలను పోలీస్‌ శాఖ ద్వారా కల్పించామన్నారు. రానున్న రోజుల్లో యువతదే ప్రధాన పాత్ర అని, వారు నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. నిరుపేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. 


నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని, ఇందులో భాగంగానే నిరుద్యోగ యువకులకు పలు ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు మరింతగా దగ్గరవుతూ నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు వివిధ కంపెనీలతో మాట్లాడి అర్హులైన యువకులకు ఉపాధిని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ ఏసీపీ సుధాకర్‌, కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌, కాచిగూడ డీఐ సిహెచ్‌ యాదేందర్‌, ఎస్సైలు టి.మధు, చరణ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీఎం  కేసీఆర్‌కు రుణపడి ఉంటా...

అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా. యువకులకు జాబ్‌ మేళా ఓ వరం లాంటిది. 

 -ఈ.అన్నపూర్ణ(గోల్నాక)


పోలీసుల సహకారంతో...

పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ నాన్‌ టెక్నికల్‌ విద్యార్థులకు జాబ్‌మేళాను నిర్వహించడం శుభపరిమాణమన్నారు. తెలంగాణ పోలీసుల సహకారంతో ఓ కంపెనీలో ఉద్యోగాన్ని దక్కించుకున్నా.

-జె.అనిత(దేవరకొండ)


ఊహించలేదు..

చిన్న వయస్సులోనే ఉద్యోగం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉద్యోగంలో ఎంపిక అయినందుకు పోలీసులుకు జీవితాంతం రుణపడి ఉంటా. మాది పేద కుటుంబం. ఈ ఉద్యోగంతోనైనా నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా.

-కార్తీక్‌ (అంబర్‌పేట)


logo