సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 24, 2020 , 01:08:51

‘శుద్ధి’ చేయాల్సిందే..

‘శుద్ధి’ చేయాల్సిందే..
  • ఆన్‌లైన్‌ పర్యవేక్షణలోకి మురుగునీటి శుద్ధి కేంద్రాలు
  • 18 ఎస్టీపీల వద్ద ఎలక్ట్రానిక్‌ సెన్సార్ల ఏర్పాటు
  • శుద్ధి చేయకుండా వదిలితే కఠిన చర్యలు

నగరంలోని 18 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఆన్‌లైన్‌ పర్యవేక్షణలోకి రానున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఎస్టీపీలు నిర్వహిస్తున్నా.. శుద్ధి చేయకుండానే మురుగునీటిని వదులుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్లాంట్లలో ఎలక్ట్రానిక్‌ సెన్సార్లు ఏర్పాటు చేస్తున్నారు. 

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కోట్ల రూపాయలు వెచ్చించి మురుగునీటిని శుద్ధి చేస్తున్నా.. సరే అది అంతా వృథా ప్రయాసగానే మారుతున్నది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) మురుగును పక్కకు మళ్లించే కేంద్రాల్లో (ఐ అండ్‌ డీ) సామర్థ్యానికి మించి మురుగు చేరుతుండడంతో దానిని శుద్ధి చేయలేకపోతున్న పరిస్థితి. ప్రస్తుతం నిత్యం 1360ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్ల)మేర మురుగు ఉత్పత్తి అవుతుండగా, 18 మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా రోజూ కేవలం 750ఎంఎల్‌డీ మేర మాత్రమే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. ఎస్టీపీ(మురుగునీటి శుద్ధి కేంద్రాల)కు సామర్థ్యం మించి మురుగు ఉత్పత్తి ఉండడంతో 610 ఎంఎల్‌డీ మేర శుద్ధి చేయకుండానే మూసీలోకి చేరుతున్నది. జరుగుతున్న శుద్ధి ప్ర్రక్రియలోనూ పారదర్శకత కొరవడింది. ఈ నేపథ్యంలోనే డీవో (డిస్వాల్డ్‌ ఆక్సిజన్‌), సీవోడీ (కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), బీవోడీ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), టీడీఎస్‌ (టోటల్‌ డిస్వాల్డ్‌ సాలీడ్‌) వంటి ఫారా మీటర్స్‌పై నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ విధానంలోకి శుద్ధి ప్రక్రియను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్టీపీల నుంచి శుద్ధి అయిన మురుగునీటిని ఏ మేర శుద్ధి చేశారో అన్నది రోజులో ఒక సందర్భంలో మాత్రమే ల్యాబ్‌ ద్వారా టెస్ట్‌లు నిర్వహించేవారు. కానీ ఆన్‌లైన్‌ విధానంతో నిరంతరం ఫారామీటర్‌ల వారీగా పర్యవేక్షించే వీలు ఉంటుంది ప్రధానంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆన్‌లైన్‌(ఓసీఈఎంఎస్‌) ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టడంతోపాటు అక్రమార్కుల ఆగడాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. సంబంధిత చెరువులు, కుంటలు కలుషితం కాకుండా, అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాలను పారబోసే ఇండ్రస్టీయల్‌ వాహనాలను నియంత్రించవచ్చని అంచనా వేస్తున్నారు. 


ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే 18 ఎస్టీపీలు 

అంబర్‌పేట (339 ఎంఎల్‌డీ), నాగోల్‌(172 ఎంఎల్‌డీ), నల్లచెరువు (30 ఎంఎల్‌డీ), అత్తాపూర్‌-1 (51 ఎంఎల్‌డీ), అత్తాపూర్‌-2 (23 ఎంఎల్‌డీ), పెద్ద చెరువు, నాచారం(10 ఎంఎల్‌డీ), మిరాలం ట్యాంక్‌-1(10ఎంఎల్‌డీ), మిరాలం ట్యాంక్‌-2 (5ఎంఎల్‌డీ), దుర్గం చెరువు(5 ఎంఎల్‌డీ), పటేల్‌ చెరువు నాచారం (2.50 ఎంఎల్‌డీ), లంగర్‌హౌజ్‌(1.20ఎంఎల్‌డీ), నూర్‌ మహ్మద్‌ కుంట (4ఎంఎల్‌డీ), సఫిల్‌గూడ మల్కాజిగిరి (0.60 ఎంఎల్‌డీ), ఖాజాకుంట (12ఎంఎల్‌డీ), ఖాజాగూడ గచ్చిబౌలి (7ఎంఎల్‌డీ), నానక్‌రాంగూడ గచ్చిబౌలి(4.50 ఎంఎల్‌డీ), జేవీఆర్‌ పార్కు నాగార్జున సర్కిల్‌(0.50 ఎంఎల్‌డీ), లింగంకుంట బీహెచ్‌ఈఎల్‌ (30 ఎంఎల్‌డీ), గోపన్నపల్లి (4.50ఎంఎల్‌డీ)మురుగునీటి శుద్ధి కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్‌ సెన్సార్లను ఏర్పాటు చేసి నిరంతరం శుద్ధి ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మురుగునీటి ఫ్లో(ప్రవాహం) ఏ సమయంలో ఎక్కువ ప్రెషర్‌ వస్తుందో?, శుద్ధి ఏ మేర జరుగుతున్నది? తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌ కంటిన్యూ ఇఫ్లూయెంట్‌ మానిటరింగ్‌ సిస్టం(ఓసీఈఎంఎస్‌)విధానం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని అధికారులు పేర్కొన్నారు. 


logo