మంగళవారం 07 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 22, 2020 , 03:31:11

నాగోల్‌లో.. వైకుంఠధామం

 నాగోల్‌లో.. వైకుంఠధామం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూడు మతాలకు ఒకే చోట వైకుంఠధామం ఏర్పాటుకు మార్గం సుగగమైంది.  హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాలకు ఒకే ప్రాంతంలో శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అత్యాధునిక సౌకర్యాలతో జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానం తరహాలో ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని నాగోల్‌ సమీపం ఫతుల్లాగూడలో ఈ శ్మశానవాటిక ఏర్పాటు కానుంది. డంపింగ్‌ యార్డ్‌ సమీపంలోని ఆరున్నర ఎకరాల స్థలంలో శ్మశానవాటిక నిర్మాణానికి హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. హిందువులకు రెండున్నర ఎకరాలు, ముస్లిం వర్గానికి రెండు, క్రిస్టియన్‌ వర్గాలకు సంబంధించి మరో రెండు ఎకరాల మేర విభజించారు. అయితే ఈ మూడు మతాలకు చెందిన శ్మశానవాటికలకు వెళ్లే ప్రవేశ ద్వారాలను విడివిడిగా ఏర్పాటు చేస్తూ ఒక్కోదానికి మధ్య ప్రహరీ నిర్మించనున్నారు. రూ. 4.25 కోట్లతో చేపట్టనున్న ఈ శ్మశానవాటిక ఏర్పాటు పనులకు సంబంధించి టెండర్‌ ప్ర క్రియ జరుగుతుంది. ఈ నెలాఖరులోగా అర్హత గల ఏజెన్సీని ఎంపిక చేసి పనులను చేపట్టనున్నామని హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు తెలిపారు.  


అత్యాధునిక మౌలిక వసతులు 

అధునాతన సౌకర్యాలతో పర్యావరణహితానికి పెద్ద పీట వేస్తూ శ్మశానవాటిక నిర్మాణానికి అడుగులు వేశారు. శ్మశానవాటికి చుట్టూ ప్రహరీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మతాలకు సంబంధించి ప్రార్థనల హాల్‌, మోడ్రన్‌ టాయిలెట్లు, ఆఫీస్‌ కార్యాలయం, వెయింటింగ్‌హాల్‌, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, శ్మశానవాటికకు వెళ్లేందుకు 40 ఫీట్ల బీటీ రోడ్‌, హిందువుల కోసం రెండు ఎలక్ట్రానిక్‌ దహనవాటికల గదులు, నీటి సౌకర్యం, మెరుగైన శానిటేషన్‌, పచ్చదనం, ఎలక్ట్రానిక్‌, అస్థికలను భద్రపర్చుకునేందుకు లాకర్‌, నడకదారి తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. మూడు మతాలకు సంబంధించి ఒకే చోట శ్మశానవాటిక ఏర్పాటు చేస్తుండడం జీహెచ్‌ఎంసీ పరిధిలో మొదటిగా చెప్పుకోవచ్చు. 


logo