హైదరాబాద్ : పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన పోలీసు ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్‌కు భారీ స్పందన లభించింది. ఈ మేరకు పోలీసు ప్రీ రిక్రూట్మెంట్ టెస్టు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఐదు జోన్ల పరిధిలో 21 వేల మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సీపీ పేర్కొన్నారు. 36 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 16 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ప్రతి జోన్ నుంచి 1,000 మంది చొప్పున ఎంపిక చేస్తామని చెప్పారు. మొత్తంగా 5 వేల మందికి 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి యువకులను సన్నద్ధం చేసేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ శిక్షణకు సీఎస్ఆర్, హెచ్సీపీ ఫండ్స్‌తో పాటు ప్రభుత్వ నిధులను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. పోలీసు శాఖలో 18 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ పరిధిలో 3,300 పోలీసు ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.