Conjunctivitis | వర్షాకాలం ప్రారంభమైతే కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పెరగడం సాధారణమే. వాటిలో ముఖ్యంగా కంజంక్టివైటిస్ (పింక్ ఐ) కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలామంది దీనిని చిన్న సమస్యగా తీసుకున్నప్పటికీ, ఇది అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.కంటి గుండ్రని భాగాన్ని, కనురెప్పల లోపలి భాగాన్ని కప్పి ఉండే పారదర్శక పొరను కంజంక్టైవా అంటారు. ఈ పొరలో ఇన్ఫ్లమేషన్ లేదా ఇరిటేషన్ ఏర్పడిన పరిస్థితినే కంజంక్టివైటిస్గా పిలుస్తారు. ఇది వైరస్లు, బ్యాక్టీరియా లేదా అలెర్జీ కారణంగా వస్తుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వైరస్లు, బ్యాక్టీరియా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతాయి.
కంజంక్టివైటిస్ ఒక అంటువ్యాధి కావడంతో బాధితులతో సన్నిహితంగా ఉండటం, వారి చేతి రుమాళ్లు, తువ్వాళ్లు వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా కూడా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యలో ఒకటి లేదా రెండు కళ్లలో ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు లేదా జిగురు వంటి స్రావం రావడం, కనురెప్పలు వాపు రావడం, మంట లేదా ఇసుక పడినట్లు గరుకుగా అనిపించడం, ముఖ్యంగా అలెర్జీ కారణంగా వచ్చినప్పుడు దురద, వెలుతురును చూడలేకపోవడం, చూపు మసకబారడం, కొన్నిసార్లు కంటి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిలో అన్ని లక్షణాలు కనిపించవు. అయితే కళ్లు ఎర్రబడటం లేదా చికాకు ఎక్కువసేపు కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు.
కంజంక్టివైటిస్ను నివారించడంలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో కీలకం. కళ్లను చేతులతో తాకడం లేదా రుద్దడం మానుకోవాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు, కంటి మేకప్ వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో రక్షణ కళ్లజోడు ధరించడం మంచిది. కళ్లు ఎర్రబడినా లేదా దురదగా అనిపించినా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించకూడదు. కంజంక్టివైటిస్ సోకిందని అనుమానం వచ్చినప్పుడు కళ్లను రుద్దకూడదు. మూసిన కనురెప్పలపై ఐస్ ప్యాక్‌ను కొద్దిసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కళ్ల నుంచి స్రావం వస్తే కాటన్ బాల్ లేదా ఒకసారి మాత్రమే ఉపయోగించే టిష్యూ పేపర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గే వరకు కాంటాక్ట్ లెన్స్‌లను ధరించకూడదు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా అవసరం.అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మూడు రోజులకుపైగా కళ్ల ఎర్రదనం, స్రావం, చికాకు కొనసాగడం, చూపు మసకబారడం, తీవ్రమైన కంటి నొప్పి లేదా వెలుతురును చూడలేకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య మరింత తీవ్రమవకుండా నివారించవచ్చు.