ఈ ప్రపంచంలో మనుషులతో పాటు ఎన్నో జీవరాశులు సహజీవనం చేస్తుంటాయి. వీటిలో ప్రతి ఇంట్లో ఎలుకలు, దోమలు, బొద్దింకలు, బల్లులు, చీమలు కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. ఏదో ఒక చోట ఇవి తమ ఉనికిని చాటుకుంటూనే ఉంటాయి. పట్టణాలలో అయితే ఎలుకల గోల పెద్దగా లేకపోయినా దోమలు, బొద్దింకల బెడద మాత్రం దాదాపుగా తప్పదు. అయితే వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల అస్ర్తాలను వాడుతుంటారు. ఎలుకలతో పాటు చీమలు, దోమలు, బొద్దింకలపై వాడే అస్ర్తాలు గురితప్పితే అవి మన ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
ముఖ్యంగా క్రిమికీటకాలు, ఎలుకల మందు, ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులను వినియోగించే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోయినా, లేక పిల్లల పట్ల అప్రమత్తంగా లేకపోయినా.. అది వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ విషపూరితమైన రసాయన పదార్థాలు ఎంతో హానికరమని, అవి మన కడుపులోకి వెళ్తే ప్రాణాలకు ముప్పు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దోమలు, ఎలుకలు వంటి వాటి నివారణకు ఏదో ఒకటి చేయక తప్పదు. లేకపోతే అది ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయితే ఎలుకలు, దోమలు, చీమలు, బొద్దింకలను కట్టడి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? తప్పని పరిస్థితుల్లో ఆ మందులను వాడినప్పుడు.. కలిగే అనర్థాలేంటి, పొరపాటున ఈ రసాయన మందులు కడుపులోకి వెళ్తే ఎలాంటి సమస్యలు చుట్టుకుంటాయి, వాటి నివారణకు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు తదితర అంశాలపై నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
చిట్టెలుకలు, ఎలుకలు, పందికొకులు లాంటివి పల్లెల్లోనే కాకుండా నగరాల్లో కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే వీటివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎలుకల నివారణ కోసం పలు రకాల మందులు మార్కెట్లో లభిస్తున్నాయి. పొడి, పేస్ట్, పెల్లెట్స్, సిరీల్ బ్లాక్స్ రూపంలో ఇవి దొరుకుతున్నాయి. వీటిని ఇళ్లలో ఉపయోగించినప్పుడు, పొరపాటున లేదా ప్రమాదవశాత్తూ కడుపులోకి వెళ్తే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ప్రధానంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఇలాంటి ప్రమాదాలు ఎకువగా చూస్తుంటాం. కొన్నిసార్లు వీటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు పీల్చుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సందర్భాలలో పిల్లలకే కాకుండా అక్కడ ఉండే పెద్దలు కూడా అనారోగ్యం పాలవుతారు. ఎరువులు, బాణసంచా, మందుబిల్లలు, ఎలుక మందుల తయారీల్లో పసుపు రంగు లేదా తెలుపు రంగులో ఉండే ఫాస్ఫరస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వెల్లుల్లి వాసన వెదజల్లుతూ ఉండే ఈ పదార్థం మనుషుల ఆరోగ్యానికి ఎంతో హానికరం.

మొదటి దశలో: ఎలుకల మందు బారిన పడిన రోగి 24 గంటల్లోగా వాంతులు, విరేచనాలతో బాధపడతాడు. తలతిరుగుడు, డయేరియా, పొట్టలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రెండో దశలో: కొందరిలో ఒకటి నుంచి నాలుగు రోజులపాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
మూడో దశలో: బహుళ అవయవాలు విఫలమవుతూ పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ దశలో మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. అయోమయం, సైకోసిస్, చిత్తభ్రమలు మొదలై, కోమాలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ ఎల్లో ఫాస్ఫరస్ విషానికి ఎలాంటి విరుగుడూ లేకపోయినప్పటికీ, డీకంటామినేషన్, సపోర్టివ్ థెరపీలతో చికిత్స చేయవచ్చు. దాంట్లో భాగంగా విషం మరింతగా శోషణ చెందకుండా ఉండటం కోసం పొట్టలోని విషాలను బయటికి రప్పించే గ్యాస్ట్రిక్ లావేజ్ పద్ధతిని అనుసరిస్తారు. అందుకోసం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా స్లైన్‌ను పొట్టలోకి పంపిస్తారు. ఈ చికిత్సతో కోలుకున్న తర్వాత, రోగిని ఐసీయూలో ఉంచి, ప్రతిరోజూ కాలేయం, మూత్రపిండాల పనితీరులను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఇళ్లలోని బాత్రూమ్లు శుభ్రపరిచే లిక్విడ్స్, అందం కోసం గోళ్లకు పెట్టుకునే నెయిల్ పాలిష్‌లు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటిల్లోని విషపూరిత రసాయనాలైన టోలీన్, ఫార్మాల్డిహైడ్, డైబ్యుటైల్ ఫాలేట్ల వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బ తింటాయి. కొన్ని సందర్భాలలో పిల్లలు ప్రమాదవశాత్తు బాత్రూమ్ శుభ్రం చేసే లిక్విడ్లు, ఫినాయిల్ లాంటివి తాగేస్తూ ఉంటారు. అవి పొట్టలోకి చేరుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతిని, వాంతులు, డయేరియా వేధిస్తాయి. కాలేయం ఇస్టిమిక్ షాక్‌కు గురవుతుంది. అందుకని బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్లు, ఫినాయిల్, పొడి, చాక్‌పీస్ రూపంలో ఉండే చీమల మందులు పిల్లలకు దూరంగా ఉంచాలి.
ఈ మాత్రలను ఎకువ పరిమాణాల్లో తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా విషపూరితం అయ్యే ప్రమాదం ఉంటుంది. పెద్దలకు 7.5 నుంచి 10 గ్రాములు, ఒకటి నుంచి ఆరేళ్లలోపు పిల్లలైతే ఒక కిలో శరీర బరువుకు 150 మి.గ్రా నుంచి 200 మి.గ్రా పారాసిటమాల్ ప్రమాదకరం. ఈ మోతాదుల్లో పారాసిటమాల్ తీసుకున్న 24 గంటల్లోగా ఆకలి తగ్గిపోవడం, వాంతులు, తల తిరుగుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 48 గంటల్లోగా పొట్టలో నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, 48 నుంచి 96 గంటల్లోగా కామెర్లు, హైపోైగ్లెసీమియా, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా పొట్టలోని మాత్రలను బయటకు రప్పించే చికిత్సనే వైద్యులు అనుసరిస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ గొలమారి శ్రీనివాస్ రెడ్డి కన్సల్టెంట్ హెపటాలజీ & లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్