Hair Problems | జుట్టు రాలడం, పలుచబడడం లేదా కాంతి కోల్పోవడం వంటి సమస్యలు కనిపించిన వెంటనే చాలామంది హెయిర్ సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే సప్లిమెంట్లు తీసుకునే ముందు రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించడం ఎంతో ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ సి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి12 వంటి పోషకాలతోపాటు తగినన్ని క్యాలరీలు కూడా అవసరం. ఒక్క ఆహార పదార్థంతో జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోదు. అలాగే పోషకాల లోపం లేకపోతే సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
రోజూ ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ ఈ, జింక్, సెలీనియం, లినోలిక్ యాసిడ్ లభిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు వెంట్రుకలకు తేమను అందించి బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఐరన్ సప్లిమెంట్లకు బదులుగా మునగ ఆకుల పొడిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, జింక్, ఐరన్, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటంతో జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకల వేర్లను బలపరచడంలో ఉపయోగపడుతుంది. ప్రోటీన్ పౌడర్లకు బదులుగా సుమారు 100 గ్రాముల పనీర్ తీసుకోవడం మంచిది. ఇందులో ప్రోటీన్తోపాటు విటమిన్ ఈ, సెలీనియం కూడా ఉండటంతో హెయిర్ ఫాలికల్స్ బలపడటానికి, వెంట్రుకలకు తగిన పోషణ అందించడానికి దోహదపడుతుంది.
విటమిన్ సి సప్లిమెంట్లకు బదులుగా ఉసిరికాయను తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు వేర్లను బలపరచడం, జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడడం, చుండ్రును తగ్గించడం, అకాలంలో జుట్టు తెల్లబడడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 సప్లిమెంట్లకు బదులుగా రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకోవడం మంచిది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఈ ఉండటంతో జుట్టు కుదుళ్లకు పోషణ అందించి, తల చర్మంలో వాపును తగ్గించి, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
విటమిన్ బి12 కోసం సప్లిమెంట్లు తీసుకునే ముందు పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, విటమిన్లు, లాక్టిక్ యాసిడ్ ఉండటంతో తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే చుండ్రును తగ్గించడం, తలలో దురదను నియంత్రించడం, జుట్టు పొడిబారకుండా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే జుట్టు రాలడం ఒక్కసారిగా ఎక్కువ కావడం, మచ్చల రూపంలో జుట్టు ఊడిపోవడం లేదా చాలా కాలంగా సమస్య కొనసాగడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి ఐరన్ (ఫెరిటిన్), విటమిన్ బి12, విటమిన్ డి, థైరాయిడ్ వంటి పరీక్షలు చేయించుకుని అసలు కారణాన్ని గుర్తించడం అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.