Digestive System | ఇటీవల కాలంలో గట్ హెల్త్ (జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం) గురించి అవగాహన పెరుగుతోంది. గట్ హెల్త్ జీర్ణక్రియకే పరిమితం కాకుండా శరీర రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ గట్ సమస్యలు తగ్గడం లేదని చాలా మంది చెబుతున్నారు. దీనికి కారణం కేవలం హెల్తీ ఫుడ్ మాత్రమే సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో గట్ మైక్రోబయోమ్ అనే సూక్ష్మజీవుల సమూహం ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు సహాయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మైక్రోబయోమ్ సమతుల్యత దెబ్బతింటే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా పూర్తి ప్రయోజనం కనిపించదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లేదా పులియబెట్టిన ఆహారాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి ఉపయోగకరమైన బ్యాక్టీరియాను అందించి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. యోగర్ట్, కేఫిర్, కిమ్చి, సావర్‌క్రాట్ వంటి ఆహారాల్లో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే కేవలం ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మాత్రమే సరిపోవని, వాటితో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. గింజలు, బీన్స్, ఓట్స్, పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మంచి బ్యాక్టీరియాకు ఇంధనంలా పనిచేస్తుంది. ఈ రెండూ కలిసి గట్ మైక్రోబయోమ్‌ను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఇలా ఫెర్మెంటెడ్ ఫుడ్స్‌తో కూడిన ఆహారాన్ని రెండు వారాల పాటు క్రమంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటం, పోషకాలు శరీరానికి బాగా అందడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే పొట్ట బరువుగా అనిపించడం, అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గవచ్చని సూచిస్తున్నారు. అయితే ఈ ఆహారాలను ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మొదట చిన్న మోతాదులో ప్రారంభించడం ఉత్తమం. ఉదాహరణకు రోజుకు అర కప్పు పెరుగు లేదా కొద్దిపాటి కిమ్చితో ప్రారంభించి, శరీరం అలవాటు పడిన తర్వాత నెమ్మదిగా మోతాదును పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.