నిద్రా దేవతను ఆహ్వానించడానికి ఎన్నో మార్గాలు. కాఫీ, టీలకు దూరంగా ఉంటాం. వెచ్చని పాలు తాగుతాం. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తాం. చక్కని సంగీతం వింటాం. వీటితోపాటు మందపాటి దుప్పటి కప్పుకోవడం ద్వారా కూడా.. ఇట్టే నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దుప్పటి ఓ మంచి ఔషధంలా కూడా పని చేస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కంటినిండా నిద్రలేనివారికి అది స్లీపింగ్ పిల్‌తో సమానమని అంటారు. మిగిలినవారితో పోలిస్తే.. మందపాటి దుప్పటి కప్పుకున్నవారిలో ఒత్తిడి ప్రభావం తక్కువగా కనిపించిందట.
ఉద్వేగపరమైన సమస్యలు, అల్జీమర్స్ ఉన్నవారు దుప్పట్లో తలదాచుకున్నప్పుడు.. సురక్షితంగా ఉన్న భావనను పొందుతున్నట్టు వెల్లడైంది. ఆ సమయంలో కార్టిసోల్ హార్మోన్ విడుదల తగ్గడమూ గమనించారు. ఈ హార్మోన్ వల్ల గుండె జబ్బులొస్తాయి, బరువు పెరుగుతారు, రక్తపోటు, డయాబెటిస్ బాధిస్తాయి. ఈ ఇబ్బందులకు మందపాటి దుప్పటితో కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చని స్లీప్ థెరపిస్టుల సలహా.