న్యూయార్క్ : ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే ఆహారమే కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు ఎంతోకాలంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించే బ్లూ జోన్స్‌లోని ప్రజల ఆహారపు అలవాట్లను పరిశోధించిన నిపుణులు ఎన్నో అంశాలను నిగ్గుతేల్చారు. మొక్కల నుంచి లభించే ఆహారం ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. ఉదాహరణకు రోజూ ఒక కప్పు బ్లాక్ బీన్స్ తీసుకుంటే 15 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల ఫైబర్ శరీరానికి లభిస్తుందని ఇందులో కొవ్వు, చక్కెర ఒక శాతం కంటే తక్కువ ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు.
వందేండ్లు ఆరోగ్యంగా జీవించడానికి బీన్స్, చిక్కుళ్ల వంటి ఆహారం మేలు చేస్తుందని బ్లూజోన్స్లోని ప్రజలపై చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ఆధారంగా నిపుణులు రూపొందించిన బ్లూజోన్ డైట్లో బీన్స్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు. బీన్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ రక్తపోటు ముప్పు, జీర్ణాశయ సమస్యలు, డిమెన్షియా, కుంగుబాటు, మధుమేహం వంటి వ్యాధుల ముప్పును నివారిస్తుందని జెరోంటాలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా పేర్కొంది. బీన్స్‌లో పుష్కలంగా లభించే పాలీఫెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ వయోసంబంధ లక్షణాలను జాప్యం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక రెడ్, పింటో, కిడ్నీ, బ్లాక్ వంటి బీన్స్ వెరైటీల్లో వాపును నివారించే పాలీపెనాల్స్ ఉన్నాయని వెల్లడించారు.