Smoking And Drinking | మనిషి శరీరానికి ధూమపానం, మద్యపానం రెండూ కూడా హానిని కలిగిస్తాయి. వీటిని రెండింటిని కలపడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది అప్పుడప్పుడు తాగే మద్యం, ధూమపానం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు అని భావిస్తారు. కానీ ఈ రెండింటిని కలిపి ఒకే సమయంలో చేయడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు నష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు. మనిషి వినాశనానికి కూడా దారి తీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
మద్యపానం, ధూమపానం కలిపి చేయడం సరదాగా బాగున్నప్పటికీ వీటిని ఒకేసారి చేయడం వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది. మద్యం శరీర డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్థామర్యం తగ్గేలా చేస్తుంది. ధూమపానం వల్ల ఏకకాలంలో శ్వాసకోశ వ్యవస్థపై దాడి జరుగుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇక ఈ రెండు కలిసినప్పుడు జీర్ణవ్యవస్థకు చికాకు కలుగుతుంది. దీని వల్ల అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. సమన్వయ లోపం వంటి తక్షణ ప్రభావాలను కూడా అనుభవిస్తారు. ఇవి మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉండే వారిని కూడా ప్రమాదంలో పడేలా చేస్తాయి. ధూమపానం, మద్యపానం విడివిడిగా శరీరంలో ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి.
ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తే, మద్యపానం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవి రెండు కలిసి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో అవయవాలన్నీ ఇబ్బందులకు గురి అవుతాయి. రక్తపోటు పెరుగుతుంది. గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడాల్సి వస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. సంతానోత్పత్తి తగ్గడంతోపాటు లైంగిక సామర్థ్యం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం కలిపి చేయడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీర్ఘకాలిక మద్యపానం వల్ల కాలేయ సిర్రోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక ధూమపానం వల్ల బ్రోన్కైటిస్, ఎంఫిసెమా, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రెండింటిని దీర్ఘకాలం పాటు కలిపి చేయడం వల్ల ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు, యువకులు, మధుమేహం ఉన్న వారు, శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఇవి మరింత హానిని కలిగిస్తాయి. గర్బిణీ స్త్రీలల్లో పుట్టుకతో వచ్చే సమస్యలు, శిశువు అభివృద్ది సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. యువకులు చిన్న వయసులోనే వీటిని అలవాటు చేసుకోవడం వల్ల వ్యసనంగా మారడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మధుమేహం, శ్వాస సమస్యలు, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారు మద్యాన్ని, పొగాకును కలపడం వల్ల ఆయా లక్షణాలు మరింత తీవ్రతరం అవ్వడంతో పాటు చికిత్స కూడా కష్టతరం అవుతుంది. కనుక మద్యపానం, ధూమపానం రెండు కూడా ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ వీటిని కలిపి చేయడం మానుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.