మేడమ్! నాలో వయసుకు మించిన వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదిస్తే యాంటీ ఆక్సిడెంట్లు సిఫారసు చేశారు. అయితే, నాకో సందేహం. సౌందర్యానికి, యాంటీ ఆక్సిడెంట్లకు సంబంధం ఉన్నదా?
మీ డాక్టర్ సలహా సరైందే. వయసు పెరిగేకొద్దీ చర్మం నిగారింపును కోల్పోతుంది. నిస్తేజం అవుతుంది. ముడతలు వచ్చేస్తాయి. ఈ మార్పును ఎవరూ ఆపలేరు. కాకపోతే, తగిన జాగ్రత్తలతో ఆ తీవ్రతను తగ్గించవచ్చు, ఆ పరిణామాన్ని కొంత మేర వాయిదా వేయవచ్చు. ఈ ప్రయత్నంలో యాంటీ ఆక్సిడెంట్స్దే కీలక భూమిక. చర్మం బిగుతుగా ఉండేందుకు, కళగా కనిపించేందుకు, నునుపుదేలేందుకు.. యాంటీ ఆక్సిడెంట్ల సహకారం అవసరం.
విటమిన్-ఎ, సి, ఇలలో ఇవి లభిస్తాయి. టమాట, పాలకూర, అల్లం, గ్రీన్ టీ, పుచ్చకాయ, డార్క్ చాకొలెట్ మొదలైన వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అపారంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారికి ఏ సప్లిమెంట్లతోనూ పెద్దగా పని ఉండకపోవచ్చు. అయినా అవసరం అనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించండి.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్