Parenting | కొంతమంది పిల్లలు ఎంత ఒత్తిడి వచ్చినా కుంగిపోకుండా తట్టుకుని నిలబడగలుగుతారు. చదువు ఒత్తిడి, స్నేహితుల మధ్య సమస్యలు, ఓటమి లేదా జీవితంలో ఎదురయ్యే చిన్న, పెద్ద ఇబ్బందులను తట్టుకుని మళ్లీ సాధారణ స్థితికి రావడంలో వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. దీనినే మానసిక ధైర్యం లేదా రెసిలియెన్స్గా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇది పుట్టుకతోనే వచ్చే లక్షణం మాత్రమే కాదని, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, రోజువారీ అనుభవాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పిల్లలు ప్రతి సమస్య నుంచి పూర్తిగా రక్షించబడితే వారు బలంగా ఎదగరని అంటున్నారు. చిన్న చిన్న నిరాశలు, అపజయాలు, ఎదురు చూపులు కూడా పిల్లలకు జీవిత పాఠాలుగా మారుతాయని పేర్కొంటున్నారు. ప్రతి సారి వెంటనే సహాయం చేయకుండా, సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించే అవకాశం ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సూచిస్తున్నారు.
పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా చెప్పగల వాతావరణం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. బాధ, కోపం, భయం లేదా నిరాశ వంటి భావాలను అణచివేయకుండా వినిపించుకునే కుటుంబాల్లో పిల్లలు భావోద్వేగ పరంగా మరింత బలంగా ఎదుగుతారు. ఏడవొద్దు, భయపడకు అని చెప్పడం కంటే, నీకు ఎందుకు ఇలా అనిపిస్తోంది? అని అడగడం ఎక్కువ ఉపయోగకరం. తల్లిదండ్రులు చూపించే ప్రవర్తనే పిల్లలకు పెద్ద పాఠం. ఒత్తిడి వచ్చినప్పుడు పెద్దలు ఎలా స్పందిస్తారో పిల్లలు గమనిస్తుంటారు. సమస్యల సమయంలో ప్రశాంతంగా ఉండడం, తప్పులను అంగీకరించడం, మళ్లీ ప్రయత్నించడం వంటి అలవాట్లు పిల్లల్లో కూడా సహజంగా పెరుగుతాయి.
పిల్లల్లో బాధ్యతాభావం పెంచడం కూడా మానసిక బలాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న పనులు చేయించడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం, తమ పనులు తామే చేసుకునే అలవాటు నేర్పించడం వల్ల వారు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకుంటారు. స్నేహాలు, కుటుంబ బంధాలు, గురువులతో మంచి సంబంధాలు కూడా పిల్లల మానసిక ఆరోగ్యానికి కీలకం. తమను అర్థం చేసుకునే వారు ఉన్నారన్న భావన పిల్లలకు భద్రతను కలిగిస్తుంది. ఒక పిల్లవాడు ఒంటరిగా కాకుండా, తనకు తోడుగా ఎవరైనా ఉన్నారని భావించినప్పుడు కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. పిల్లల జీవితంలో పూర్తిగా ఒత్తిడి లేకుండా చేయడం సాధ్యం కాకపోయినా, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం మాత్రం చాలా అవసరం. చిన్నప్పటి నుంచే సహనం, సమస్య పరిష్కారం, భావోద్వేగ నియంత్రణ వంటి నైపుణ్యాలు పెంపొందితే భవిష్యత్తులో వారు మరింత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోగలుగుతారు.