Digestive System | ఆహార జీర్ణక్రియలో కీలక పాత్ర పోషించే జీర్ణాశయం లేదా గ్యాస్ట్రోఇంటెస్టినల్ (GI) ట్రాక్ట్ ప్రధానంగా ఆహారాన్ని జీర్ణం చేయడం, పోషకాలను శోషించడం, వ్యర్థాలను బయటకు పంపించడం వంటి పనులు నిర్వహిస్తుంది. అయితే దీని పాత్ర కేవలం జీర్ణక్రియకు మాత్రమే పరిమితం కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం రోగనిరోధక శక్తి, మెటబాలిజం, మానసిక ఆరోగ్యంపై కూడా గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. జీర్ణ వ్యవస్థలో లక్షల కోట్ల సూక్ష్మజీవులు నివసిస్తాయి, వీటిని కలిపి గట్ మైక్రోబియోమ్ అని పిలుస్తారు. వీటినే మంచి బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడటమే కాకుండా, శరీరానికి రక్షణ వ్యవస్థగా కూడా పనిచేస్తాయి. అందుకే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దెబ్బ తింటే, వ్యక్తి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
అయితే పోషకాహార నిపుణులు తెలిపిన ప్రకారం అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలు కేవలం జీర్ణక్రియ కారణంగానే రావాల్సిన అవసరం లేదు. చాలా జీర్ణ వ్యవస్థ లక్షణాలు కేవలం తప్పు జీర్ణక్రియ వల్ల మాత్రమే రావు అని నిపుణులు చెబుతున్నారు. హైడ్రేషన్, మ్యూకోసల్ రక్షణ, కొన్ని ఫైటోకెమికల్స్ వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలు ఆంత్రం గోడ సమగ్రతను, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆంత్రం గోడను బలపరచడం, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం కోసం ఆ వ్యవస్థకు మద్దతు ఇచ్చే గుణాలు కలిగిన పదార్థాలతో తయారయ్యే రెండు ఫంక్షనల్ డ్రింక్స్ రెసిపీలు ఇలా ఉన్నాయి.
మొదటి పానీయం విషయానికి వస్తే.. అలో-కోకోనట్ గట్ సూతింగ్ డ్రింక్ గా దీన్ని చెప్పవచ్చు. దీనికి 200 మిల్లీలీటర్ల కొబ్బరి నీరు, 2 టేబుల్ స్పూన్ల తాజా అలొవెరా జెల్, 5-6 తాజా పుదీనా ఆకులు తీసుకోవాలి. ఈ పదార్థాలను 10 నుంచి 15 సెకన్ల పాటు బ్లెండ్ చేసి తాజాగా ఉన్నప్పుడే తాగాలి. అలొవెరాలో ఉండే ఆసెమానన్ వంటి పాలిశాకరైడ్లు ఆంత్రం మ్యూకోసల్ సమగ్రతను కాపాడడంలో సహాయపడతాయి. అలాగే దానిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అదనంగా కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్, తగిన హైడ్రేషన్‌ను అందిస్తాయి. ఇవి సాధారణ గ్యాస్ట్రోఇంటెస్టినల్ పనితీరుకు ముఖ్యం. మరోవైపు పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ స్మూత్ మజిల్స్‌ను సడలించడంలో సహాయపడుతుంది.
రెండవ పానీయంగా లికోరైస్-ఫెన్నెల్ గట్ సపోర్ట్ టీ ని చెప్పవచ్చు. దీనికి ఒక కప్పు నీరు, పావు టీ స్పూన్ లికోరైస్ రూట్ పొడి (అతి మధురం), అర టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి. ఈ పదార్థాలను 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి వడకట్టి గోరువెచ్చగా తాగాలి. లికోరైస్ రూట్లో గ్లైసిర్రిజిన్, ఫ్లేవనాయిడ్లు ఉండి ఇవి గ్యాస్ట్రిక్, ఆంత్రం మ్యూకోసల్ రక్షణకు సహాయపడతాయి. అదనంగా సోంపు గింజల్లో ఉండే అనెథోల్ ఆంత్రం కండరాల సంకోచాలను తగ్గించి గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే,అల్లంలో ఉండే జింజరాల్స్ గ్యాస్ట్రిక్ మొటిలిటీని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సౌకర్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఈ రెండు పానీయాలను సులభంగా తయారు చేసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పానీయాలు ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.