నేను ఏడునెలల గర్భిణిని. ఇంకా చనుమొనలు పొడుచుకుని రాలేదు. దీనివల్ల పుట్టే బిడ్డకు పాలు పట్టించడం ఇబ్బంది అవుతుందా?
ఒక సోదరి
గర్భధారణ దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ప్రసవ సమయానికంతా బిడ్డకు పాలివ్వడానికి అనువుగా రొమ్ములు సిద్ధం అవుతాయి. అంతకుముందు చిన్నగా, కొంత రొమ్ము లోపలికి చొచ్చుకొని ఉన్న చనుమొన గర్భధారణ సమయంలో పొడుచుకుని వస్తుంది. దాని చుట్టూ ఉండే ‘ఎరియోలా’ కూడా అభివృద్ధి చెందుతుంది. శిశువు పాలు తాగే సమయానికి మెత్తగా రబ్బరులా మారుతుంది. కాకపోతే, పాలు తాగించడానికి తన రొమ్మును ఎలా పట్టుకోవాలి అనే విషయం తల్లికి తెలిసి ఉండాలి.
గర్భిణులు స్నానం చేస్తున్నప్పుడు చనుమొనను శుభ్రం చేసుకోవడానికి రసాయన సబ్బు ఉపయోగించరాదు. స్వచ్ఛమైన నీటిని వాడితే సరిపోతుంది. మృదువైన చర్మం ఉన్న వారిలో చనుమొనలకు తరచూ పగుళ్లు వస్తాయి. ప్రసవ సమయానికంతా చనుమొన పెరిగి బయటికి పొడుచుకుని రావడం వల్ల శిశువు తేలిగ్గా నోట్లోకి తీసుకోగలదు. కొందరిలో చనుమొనలు మిగతా రొమ్ముకు గట్టిగా అంటుకొని ఉంటాయి.
శిశువుకు పాలు తాగించడం ప్రారంభించగానే విడిపోతాయి. దీంతో ఏ సమస్యా రాదు. చనుమొనను రెండు వేళ్ల మధ్య ఉంచి నొక్కినప్పుడు.. బయటికి వచ్చే బదులు లోనికి వెళ్లినట్టయితే.. ఇబ్బంది ఉన్నట్టే. ఐదో నెల నుంచి ప్రత్యేక స్థన వ్యాయామం చేయాలి. దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుంది. రోజూ చనుమొనకు ఇరువైపులా రెండు బొటన వేళ్లను సమాంతరంగా ఉంచి చర్మాన్ని చనుమొనకు దూరంగా లాగాలి. ఇలా నిలువుగా కూడా కొద్ది నిమిషాలు చేస్తే చనుమొన బయటికి వస్తుంది.