Fatty Liver | మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఫ్యాటీ లివర్ (Fatty Liver) కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే సాధారణ ఆరోగ్య సమస్య. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోయినా, తర్వాత కాలేయంలో వాపు, నష్టం, తీవ్రమైన పరిస్థితుల్లో Cirrhosis వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే సరైన ఆహారం, జీవనశైలి మార్పులు పాటించడం చాలా ముఖ్యం. ఇక గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల ప్రకారం వంటలో ఉపయోగించే నూనెల ఎంపిక కూడా ఫ్యాటీ లివర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సోయాబీన్, కార్న్, కాటన్సీడ్, గ్రేప్సీడ్, కనోలా వంటి నూనెలను అధికంగా వాడడం కాలేయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
అయితే కొన్ని ఆరోగ్యకర నూనెలు కాలేయానికి మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. దీనిని సలాడ్స్లో లేదా తక్కువ వేడి వంటల్లో ఉపయోగించవచ్చు. అవకాడో ఆయిల్ కూడా మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇది బైల్ ప్రవాహాన్ని మెరుగుపరచి కొవ్వు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలో వంటకు లేదా సలాడ్స్లో ఉపయోగించడం మంచిది. కోల్డ్-ప్రెస్డ్ ఆవ నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇది వాపును తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి మెటబాలిజాన్ని పెంచడంలో సహాయపడుతుంది. భారతీయ వంటల్లో దీన్ని తేలికపాటి ఫ్రై లేదా తాళింపు కోసం ఉపయోగించవచ్చు.
సెసేమ్ (నువ్వుల) ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, లిగ్నాన్లు ఉండటం వల్ల కాలేయ ఎంజైమ్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మెటబాలిజానికి కూడా మద్దతు ఇస్తుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ (అవిసె గింజల నూనె)లో ఉండే ప్లాంట్-బేస్డ్ ఒమేగా-3 కొవ్వులు కాలేయంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇది వేడి పట్ల సున్నితంగా ఉండటం వల్ల దీనిని ముడి రూపంలోనే తీసుకోవడం ఉత్తమం. సరైన నూనెలను ఎంచుకోవడం ఫ్యాటీ లివర్ నియంత్రణలో ఒక ముఖ్యమైన అడుగు. అయితే దీనితోపాటు సమతుల్య ఆహారం, నియమిత వ్యాయామం కూడా అనుసరించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.