Dear Zindagi | మాకు బాబు పుట్టి రెండు వారాలు అవుతున్నది. బిడ్డకు వాంతులు అవుతుంటే కంగారుగా దవాఖానకు తీసుకెళ్లాం. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. తగ్గుముఖం పట్టినట్టే అనిపించి… మళ్లీ వాంతులు మొదలయ్యాయి. ఆకుపచ్చ రంగులో, పసరులా వాంతులు చేసుకుంటున్నాడు. పాలు పట్టినా తాగడం లేదు. మళ్లీ వైద్యులను సంప్రదిస్తే… ఆస్పత్రిలో అడ్మిట్ చేయమన్నారు. పరీక్షలు చేసిన తర్వాత, పేగులు మడతపడ్డాయని చెప్పారు. ఆపరేషన్ చేయాలంటున్నారు! రోజుల చిన్నారికి ఆపరేషన్ చేయవచ్చా? ఇంతకీ మా చిన్నారికి వచ్చిన సమస్య ఏమిటో తెలియజేయండి?
మీరు చెప్పిన వివరాల ప్రకారం.. మీ బిడ్డకు పేగులు మడతపడటం గానీ, అడ్డుపడటం గానీ జరిగింది. జీర్ణాశయం నుంచి పేగుల్లోకి పైత్య రసం విడుదలవుతుంది. పేగుల మార్గం సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతుంది. దీనిని ఇన్టెస్టినల్ అబ్స్ట్రక్షన్ అంటారు. మీ బాబు విషయంలో మాల్ రొటేషన్ ఆఫ్ గట్ అనే పరిస్థితి ఏర్పడిందనుకోవచ్చు. సాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే, పొట్టలో ఉన్నటువంటి పేగులు ఒకే ట్యూబ్ ద్వారా తయారవుతాయి. పిండ దశలో ఆ ఒక్క నాళం పెరుగుతూ పోతూ ఒక క్రమపద్ధతిలో తిరుగుతూ అది పేగుల్లో రకరకాల భాగాలుగా విడిపోతుంది. ఏదైనా కారణం వల్ల ఈ పేగులు సరిగ్గా తిరగకుండా ఉన్నట్లయితే, కొన్నిసార్లు వాటి మీద అవి చుట్టుకుంటాయి. అప్పుడు వాటికి రక్త సరఫరా ఆగిపోతుంది.
అదేవిధంగా పేగుల్లో దారి మూసుకుపోతుంది. దీంతో ఏం ఇచ్చినా బిడ్డ తీసుకోకపోగా, పేగుల్లోకి ఉత్పత్తయ్యే స్రవాలు కిందికి వెళ్లే మార్గం లేక ఆకుపచ్చ రంగు వాంతులు జరుగుతాయి. మీరు చెప్పిన వివరాల ప్రకారం బిడ్డ పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తున్నది. కంగారుపడాల్సిందేం లేదు! వైద్యులు సూచించినట్టు శస్త్రచికిత్స చేయించడం మంచిది. దీనివల్ల పేగుల్లో సమస్య తొలగిపోతుంది. రోజుల శిశువుకు శస్త్రచికిత్స ఏమిటని ఆందోళన వద్దు. ఇప్పుడున్న అధునాతన చికిత్సా విధానాల్లో ఈ సర్జరీ తేలికే! శస్త్రచికిత్స తర్వాత బాబు త్వరగానే కోలుకుంటాడు. అసాధారణ కేసుల్లో తప్ప సాధారణంగా ఇలాంటి కేసుల్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు!
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్