Omega-3 Fatty Acids | ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్.. గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ మహా మంచి కొవ్వు వల్ల ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయని.. తద్వారా గుండెజబ్బు, మధుమేహం లాంటి వ్యాధులు దూరం అవుతాయని నిపుణులు చెబుతారు. ఒమేగా-3కి సంబంధించి మరో ఆసక్తికరమైన పరిశోధన తాజాగా వెలువడింది. పల్మనరీ ఫైబ్రోసిస్ విషయంలో ఒమేగా-3 ప్రభావాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు వర్జీనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు.
ఊపిరితిత్తులకు వచ్చే కొన్ని సమస్యలు తీవ్రతరం అయినప్పుడు, అది పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ప్రమాదకర స్థితికి దారితీస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలహీనపడుతూ, ప్రాణవాయువు అందక ఊపిరి కోల్పోయే పరిస్థితీ ఏర్పడుతుంది. ఈ సమస్యకు ఊపిరితిత్తుల మార్పిడే శరణ్యం అవుతుంది. అయితే కొన్ని వారాల పాటు ఒమేగా-3 పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు, అవిసె గింజలు లాంటివి ఆహారంగా తీసుకున్నప్పుడు.. రోగి ఆరోగ్యం చాలావరకు మెరుగుపడినట్టు తేలింది. ఒంట్లోని కార్బన్ డై ఆక్సైడ్‌ను తగ్గించేందుకు కూడా ఇవి సాయపడుతున్నట్టు వెల్లడైంది.