Omega 3 Fatty Acids | మన శరీరానికి అత్యంత అవసరమైన మంచి కొవ్వులలో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఒకటి. ఇవి గుండె ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు అనేక కీలక వ్యవస్థలు సమర్థవంతంగా పని చేయడంలో ఎంతో సహాయపడతాయి. అయితే శరీరం ఈ పోషకాలను స్వయంగా తయారు చేసుకోలేదు కనుక ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న గుండెజబ్బులు, మానసిక ఒత్తిడి, చర్మ సమస్యలు వంటి వాటిని తగ్గించడంలో ఒమెగా-3 కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోయే ప్రక్రియను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. అందువల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.
మెదడు నిర్మాణంలో కూడా ఒమెగా-3 ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ముఖ్యంగా DHA అనే రకం మెదడు గ్రే మ్యాటర్లో ఎక్కువగా ఉండి నాడుల పనితీరుకు సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా స్పష్టత పెరగడంలో ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యలు, అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఒమెగా-3 పాత్ర ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలో దీర్ఘకాలిక వాపులను తగ్గించే గుణాలు కూడా ఒమెగా-3లో ఉన్నాయి. ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యల లక్షణాలను తగ్గించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అంతర్గత ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. చర్మం, కళ్ల ఆరోగ్యానికి కూడా ఒమెగా-3 మేలు చేస్తుంది. చర్మానికి తేమను అందించి మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ కాంతిని మెరుగుపరచడంలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఈ ఫ్యాటీ ఆమ్లాలు ఉపయోగపడతాయి.
మానసిక ఆరోగ్యంపై కూడా ఒమెగా-3 సానుకూల ప్రభావం చూపుతుంది. ఇవి మెదడులో ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా సెరటోనిన్ స్థాయిలను ప్రభావితం చేసి డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒమెగా-3 ని సహజంగా పొందేందుకు సాల్మన్, మాకెరెల్, సార్డిన్స్, హెర్రింగ్ వంటి కొవ్వు ఎక్కువగా ఉన్న చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, సోయాబీన్స్ వంటి వృక్షాధార ఆహారాల్లో కూడా ఒమెగా-3 లభిస్తుంది. పాలకూరలో కూడా కొంతమేర ఈ పోషకం ఉంటుంది. సాధారణంగా రోజుకు 250 నుంచి 500 మిల్లీగ్రాముల వరకు ఒమెగా-3 తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి రోజుకు 1000 మిల్లీగ్రాములు వరకు అవసరమవుతాయి. ఇన్ఫ్లమేషన్ సమస్యలు ఉన్నవారికి 2000 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అయితే అధిక మోతాదులు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు లేదా రక్తస్రావ సమస్యలు ఉన్నవారు ఒమెగా-3 సప్లిమెంట్లు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. ఈ సప్లిమెంట్లను కొవ్వు ఉండే ఆహారంతో కలిసి తీసుకుంటే శరీరం వాటిని మెరుగ్గా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.