Children @ Obesity | బొద్దుగా ఉండే పిల్లల్ని మనం ఇష్టపడుతుంటాం. లావుగా ఉండే పిల్లల తల్లిదండ్రులు కూడా మా వాడు బొద్దుగా ఉన్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే, లావుగా ఉండే పిల్లల్లో పెద్దయ్యాక వారి మెదడు ఆరోగ్యంగా ఉండదు. చిన్ననాట ఎంత లావుగా ఉంటారో పెద్దయ్యాక అంత మెదడు సంబంధ సమస్యలు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. చిన్నారుల మెదడు అభివృద్ధి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి దీర్థకాలిక అధ్యయనం నుంచి ఎంఆర్ఐ డాటాను పరిశోధకులు విశ్లేషించారు. కౌమార దశకు చేరుకోవడానికి ముందు బలహీన మెదడు, అధిక బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) మధ్య సహసంబంధాన్ని గుర్తించారు. కనెక్టికట్ న్యూ హెవెన్‌లోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో రేడియాలజీ, బయోమెడికల్ ఇమేజింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలో సిమోన్ కల్టెన్హౌజర్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ఈ పరిశోధన అధ్యయన పత్రాన్ని రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో ప్రదర్శించారు.
స్ట్రక్చరల్ ఎంఆర్ఐ, రెస్టింగ్ స్టేట్ ఫంక్షనల్ ఎంఆర్ఐ నుంచి డాటాను విశ్లేషించారు. ఇది మెదడు ఆరోగ్యం పూర్తి సమాచారాన్ని అందించేందుకు రక్తప్రవాహంలో మార్పులను గుర్తించడం ద్వారా మెదడు కార్యకలాపాలను అంచనా వేయడానికి సహాయపడింది. అధిక బరువు, బీఎంఐ జడ్-స్కోర్ ఉన్న చిన్నారుల్లో మెదడులో శరీర నిర్మాణ సంబంధ విషయంలో అసాధరణతలను పరిశోధకులు గుర్తించారు. మెదడుకు సంబంధించి రెండు అర్ధ గోళాల మధ్య ప్రధాన లింక్ అయిన కార్పస్ కాలోసమ్ తెల్ల పదార్థంలో క్షీణతను కనుగొన్నారు. అర్ధగోళాల లోపలున్న ట్రాక్ట్లలో కూడా మార్పులు కనిపించాయి. మెదడు బయటిపొర సన్నగా ఉండటం కూడా గుర్తించారు.
చిన్నారుల్లో పెరగిన బరువు, బీఎంఐ.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అధిక బీఎంఐ ఉన్న పిల్లల్లో అధ్వానమైన పనితీరు, చదువులో వెనకబడిపోవడం వంటి ఫలితాలు చూపుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. చిన్నతనంలో ఊబకాయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి తీవ్ర పరిణామాలను మిగుల్చుతుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు హెచ్చరించాయి. అధిక బరువు ఉండే పిల్లల్లో ఆస్తమాతో పాటు స్లీప్ ఆప్నియా వంటి శ్వాస సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.