హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో అర్హులందరికీ సంక్షేమ పింఛన్లు ఇస్తామని, పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పిన మాటలు కాలగర్భంలో కలసిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నప్పటికీ పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెంచకపోగా కుంటిసాకులతో కోతలు విధిస్తూ లబ్ధిదారులకు మొండిచేయి చూపిస్తున్నది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 44.82 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చింది. అందుకోసం రూ.58,696 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పింఛన్ల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను 41.06 లక్షలకే పరిమితం చేసింది. తద్వారా ఏకంగా 3,75,702 మందికి ఎగనామం పెట్టడంతోపాటు పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారిలో పలు వర్గాలకు తలుపులు మూసివేసింది. ‘కేసీఆర్ అత్తకు మాత్రమే పింఛన్ ఇస్తున్నడు.
మేము అధికారంలోకి వస్తే అత్తతోపాటు కోడలికి కూడా పింఛన్ ఇస్తాం. వృద్ధాప్య పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతాం’ అని అసెంబ్లీ ఎన్నికల ముందు ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు.. చివరికి ఆ హామీలను తుంగలో తొక్కారు. ఇప్పటికే వారి పాలనా కాలంలో సగం పూర్తయినా పింఛన్ల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కొత్తగా కోడలికి పింఛన్ ఇవ్వకపోగా అత్త పింఛన్‌కే కోత పెడుతున్నారు. పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచుతామని చెప్పినా.. ఇప్పటికీ పాత మొత్తాలే కొనసాగుతున్నాయి. దీంతో ‘ఆసరా’ పింఛన్ పేరును ‘చేయూత’ పింఛన్‌గా మార్చడంలో కాంగ్రెస్ సర్కార్ చూపిన శ్రద్ధ.. ఆ పింఛన్ల సంఖ్యను పెంచడంలో కనిపించలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
వృద్ధులకు అవకాశం లేదా?
కొత్త అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నప్పటికీ వాటి కోసం వృద్ధులు, హెచ్ఐవీ పేషంట్లు, బీడీ కార్మికులు, బీడీ టేకేదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,20,168 మంది బీడీ కార్మికులు, 3,749 మంది బీడీ టేకేదారులు, 46,646 మంది హెచ్ఐవీ పేషెంట్లు, 16,922 మంది ఫైలేరియా బాధితులు, 9,808 మంది డయాలసిస్ రోగులు పింఛన్ పొందుతున్నట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తున్నది.
కొత్త పింఛన్లపై సస్పెన్స్
పంద్రాగస్టు నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తిచేయలేదు. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు? అర్హులను ఎప్పుడు ఎంపిక చేస్తారు? పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
