Low carbs and Diabetes | మనం తీసుకునే ఆహారం, మనం ఆచరించే జీవనశైలి.. మనలో వ్యాధులు రావడానికి కారణాలవుతాయి. ప్రతి ఒక్కరికి శక్తినిచ్చే పోషక పదార్థాలుగా కొర్బోహైడ్రేట్లను చెప్పుకోవచ్చు. మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇవి మరీ తక్కువగా ఉండటం మధుమేహానికి కారణమవుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం పత్రాలను ఇటీవల జరిగిన సైంటిఫిక్ సెషన్స్ కాన్ఫరెన్స్లో సమర్పించారు.
మధుమేహం సమస్య లేని 2,04,541 మంది పెద్దల నుంచి పరిశోధకులు డాటా సేకరించారు. వారి 30 సంవత్సరాల హెల్త్ ప్రొఫైల్స్ పరీక్షించి, ఆపై వారి డాటాతో కూడిన ప్రశ్నాపత్రాలను పూరించాలని కోరారు. ప్రతి నాలుగేండ్లకు వారి ఆహారపు అలవాట్లు వంటి విషయాలను ఈ ప్రశ్నాపత్రంలో అడిగారు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల నుంచి ఒక రోజులో వారు పొందిన శక్తిని లెక్కించడం ఈ అధ్యయనం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒక వ్యక్తి శక్తిలో కార్బోహైడ్రేట్లు సగటున 45-65 శాతం వరకు అందించాలి. అయితే అధ్యయనంలో పాల్గొన్న కొంతమంది ఆహారంలో కార్బోలు కేవలం 40 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. తక్కువ కార్బ్ ఆహారాన్ని తీసుకునేవారు, జంతువుల నుంచి ప్రోటీన్లు, కొవ్వులను పొందిన వ్యక్తుల్లో టైప్-2 డయాబెటిస్ అభివృద్ధి అయ్యే అవకాశాలు 35 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు తమ ఆహారంలో తగినంత తృణధాన్యాలను చేర్చనప్పుడు ఇది 39 శాతానికి పెరిగింది. మరోవైపు, ఇదే తక్కువ కార్బ్ ఆహారాన్ని అనుసరించి.. మొక్కల ఆధారిత ప్రోటీన్లు, కొవ్వులున్న ఆహారాలను తీసుకున్న వారికి మధుమేహం వచ్చే అవకాశాలు 6 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారు. కార్బోహైడ్రేట్ల నాణ్యత ముఖ్యం కానీ, పరిమాణం కాదని ఈ అధ్యయనంలో పరిశోధకులు నిర్ధారించారు. సంతృప్త కొవ్వులు ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉన్నందున తక్కువ కార్బ్, జంతు-ఆధారిత ప్రోటీన్ ఆహారం డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు తెలిపారు.