Lip Care | మేడమ్! పెద్దపెద్ద కళ్లు, చక్కని ముక్కు, మంచి రంగు, తగిన ఎత్తు.. నేను ఆకర్షణీయంగానే ఉంటాను. కానీ, పెదవులే కాస్త చిన్నగా ఉంటాయి. లిప్‌స్టిక్‌తో మేనేజ్ చేద్దామని ప్రయత్నించినా కుదరడం లేదు. కాస్మటిక్ సర్జరీ ద్వారా నా సమస్యను సరిచేసుకోవచ్చా?
ఓ పాఠకురాలు
పెదాలు ముఖానికి సంతకం లాంటివి. అందాన్ని రెట్టింపు చేస్తాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి.. మన పెదాలనూ గమనిస్తారు. వాటి నిర్మాణంలో ఏ చిన్న లోపం ఉన్నా.. మహిళలు ఆత్మన్యూనతకు గురవుతారు. పెదాల ఆకృతి జన్యుపరమైంది. మనం నిర్ణయించుకోలేం. కొన్నిసార్లు.. ప్రమాదాల్లో కుట్లు పడటం, బలమైన గాయాలు.. మొదలైన కారణాలతోనూ ఆకృతి కోల్పోవచ్చు. కొందరి పెదాలు పొడిబారినట్టు ఉంటాయి. పొలుసులు పొలుసులుగా చర్మం ఊడిపోతూ ఉంటుంది. తరచూ రక్తస్రావం అవుతుంది. ఇలాంటి సమస్యలను అస్సలు ఉపేక్షించకూడదు. కొన్నిరకాల క్రీమ్స్ ద్వారా పెదాల్ని తేమగా ఉంచడం సాధ్యమే. హైయాల్యురోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ ద్వారా పెదాల ఎగుడుదిగుళ్లను సరిచేయవచ్చు. నచ్చిన రూపాన్ని ఇవ్వవచ్చు.
హైయాల్యు రోనిక్ యాసిడ్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కాబట్టి, శరీర వ్యవస్థ నుంచి కూడా వ్యతిరేకత ఎదురుకాదు. దుష్ఫలితాలు ఉండవు. ఫ్యాట్ ఇంజెక్షన్స్ ద్వారా.. పెదాల పరిమాణాన్ని కృత్రిమంగా పెంచవచ్చు. మన శరీరంలోంచి తీసిన కొవ్వునే ఇందుకు ఎంచుకుంటారు కాబట్టి, రియాక్షన్స్‌కు ఆస్కారం లేదు. నోటి చుట్టూ ముడతలు ఏర్పడటం వల్ల పెదాలు బండబారిపోయి ఉంటే.. బొటాక్స్ ద్వారా సరిచేయవచ్చు. ఈ పద్ధతులేవీ పనిచేయనప్పుడు.. సర్జరీని ఎంచుకోవచ్చు. కైలోప్లాస్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఇది సరళమైన చికిత్స. ఇరవై నాలుగు గంటలలో డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి, ధైర్యంగా నిపుణులను సంప్రదించవచ్చు. వైద్య పరీక్షల తర్వాత.. ఏ చికిత్సా విధానాన్ని ఎంచుకోవాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్