GLP-1 Medicine | బరువు తగ్గడం, టైప్-2 డయాబెటిస్ నియంత్రణ కోసం చాలా మంది GLP-1 మందులను వాడుతున్నారు. అయితే ఈ GLP-1 ఔషధాలపై ప్రముఖ వైద్య నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Ozempic, Wegovy, Mounjaro వంటి మందులు వేగంగా బరువు తగ్గించే క్విక్ ఫిక్స్ కాదని స్పష్టం చేస్తున్నారు. ఇవి దీర్ఘకాలికంగా ఊబకాయం (Obesity), టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యల నిర్వహణ కోసం మాత్రమే ఉపయోగించాల్సిన ప్రిస్క్రిప్షన్ ఔషధాలని వారు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో సెమాగ్లూటైడ్ (Semaglutide) పేటెంట్ ముగియడంతో భారతత్‌లో అనేక జనరిక్ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. దీని వల్ల ఈ మందులు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే దీనివల్ల అసలు అవసరమైన రోగులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
GLP-1 మందులు శాస్త్రీయంగా ప్రభావవంతమైనవే అయినప్పటికీ, వాటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎండోక్రైనాలజిస్ట్ లేదా MD మెడిసిన్ అర్హత కలిగిన వైద్యులే ఈ మందులను సూచించాలి. ఈ ఔషధాలకు కొన్ని దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నందున నిపుణుల పర్యవేక్షణ చాలా కీలకం. ఇటీవల డ్రగ్ నియంత్రణ సంస్థలు అనధికారికంగా ఈ మందుల విక్రయంపై చర్యలు కూడా ప్రారంభించాయి. అంతేకాకుండా ఈ మందులను తప్పుగా వాడటం వల్ల గాల్ బ్లాడర్ రాళ్లు, డీహైడ్రేషన్, ప్రోటీన్ లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక సరైన రోగులు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో వీటిని వాడాలి. అలాగే ఈ మందులు తీసుకునేంత వరకు మాత్రమే ప్రభావం చూపుతాయి. మధ్యలో ఆపేస్తే దాదాపు 70 శాతం కేసుల్లో మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదే విధంగా ఒకప్పుడు ఈ మందులు చాలా ఖరీదైనవిగా ఉండేవి (రూ.16వేల నుంచి రూ.20వేల వరకు), కానీ ఇప్పుడు జనరిక్ వేరియంట్లతో ధరలు గణనీయంగా తగ్గాయి. ఊబకాయం ఒక క్లిష్టమైన ఆరోగ్య సమస్య. దీన్ని కేవలం మందులతోనే కాకుండా, సరైన ఆహారం, వ్యాయామంతో కలిపి నిర్వహించాలి. GLP-1 ఔషధాలు వాడేటప్పుడు కండరాల నష్టం, పోషకాహార లోపం, జీర్ణ సంబంధ సమస్యలు, పాంక్రియాటైటిస్, కిడ్నీ సమస్యలు వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మందులను స్వయంగా వాడటం ప్రమాదకరం. తప్పనిసరిగా వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి. బరువు తగ్గడం కోసం షార్ట్‌కట్‌గా కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య నిర్వహణలో భాగంగా మాత్రమే ఈ మందులను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.