Heart Burn | నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉదయం లేవగానే ఛాతీలో మంట, నోటిలో పుల్లని రుచి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. చాలామంది దీనికి మసాలా ఆహారం లేదా జీర్ణ సమస్యలే కారణమని భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి భోజనం చేసే సమయం కూడా ఉదయపు యాసిడ్ రిఫ్లక్స్‌కు ప్రధాన కారణంగా మారుతుంది. ముఖ్యంగా ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు సరైన సమయం దొరకదు. భోజనం చేసిన వెంటనే పడుకోవడంతో పొట్టలోని ఆమ్లాలు పైకి ఎగసి అన్నవాహికలోకి చేరే అవకాశం పెరుగుతుంది. పరిశోధనల ప్రకారం భోజనం చేసిన తర్వాత కనీసం మూడు గంటల వ్యవధి లేకుండా నిద్రపోతే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ప్రమాదం అధికమవుతుంది.
ఆలస్యంగా భోజనం చేయడం శరీరంలోని జీవక్రియలపై కూడా ప్రభావం చూపుతుంది. రాత్రి సమయంలో ఇన్సులిన్ స్పందన తగ్గిపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా నియంత్రణ కావు. అదే సమయంలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది, జీర్ణక్రియ కొనసాగడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఉదయం లేవగానే అలసట, భారంగా అనిపించడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కనిపిస్తాయి. రాత్రివేళల్లో కొవ్వును కరిగించే ప్రక్రియ కూడా మందగిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా లేదా భారమైన ఆహారం తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు కొవ్వుగా నిల్వయ్యే అవకాశం పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌కు మరో ముఖ్య కారణం అన్నవాహిక, జీర్ణాశయం మధ్య ఉండే కండరాల వాల్వ్‌పై పడే ఒత్తిడి. నిలబడి ఉన్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా కడుపులోని ఆమ్లాలు కిందనే ఉంటాయి. కానీ కడుపు నిండుగా ఉండగానే పడుకోవడం వల్ల ఈ వాల్వ్‌పై ఒత్తిడి పెరిగి ఆమ్లాలు పైకి రావడానికి అవకాశం కలుగుతుంది.
ఈ సమస్యను తగ్గించేందుకు రాత్రి భోజనాన్ని సాధ్యమైనంత వరకు సాయంత్రం 7 నుంచి 7.30 గంటల మధ్య పూర్తిచేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రకు కనీసం 3 గంటల ముందే భోజనం ముగిస్తే కడుపు ఖాళీ అయ్యేందుకు తగిన సమయం లభించి రిఫ్లక్స్ ప్రమాదం తగ్గుతుంది. భోజన సమయంతోపాటు కొన్ని జీవనశైలి మార్పులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయ ఆమ్లాలు అన్నవాహికలోకి చేరే అవకాశాలు తగ్గుతాయి. అలాగే మంచం తల భాగాన్ని ఆరు నుంచి ఎనిమిది అంగుళాల మేర ఎత్తుగా ఉంచితే గురుత్వాకర్షణ సహాయంతో ఆమ్లాలు పైకి రావడం నివారించవచ్చు. భోజనం చేసిన తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయి పొట్టలో ఆమ్లాల ప్రభావాన్ని కొంత మేర తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయపు యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించడంలో భోజనం చేసే సమయం కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి భోజనాన్ని ముందుగానే ముగించడం, నిద్రకు తగిన విరామం ఇవ్వడం, సరైన నిద్ర భంగిమలను పాటించడం ద్వారా ఉదయపు ఛాతీ మంట, పుల్లని రుచి వంటి సమస్యలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.