అత్యుత్తమ వ్యాయామాల్లో జాగింగ్ ఒకటి. కానీ, ‘జాగింగ్’ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కొందరు వాపోతుంటారు. నిజానికి వాళ్లు చేసేది ‘రన్నింగ్’ అనీ.. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ పేరుతో రన్నింగ్ చేస్తే.. కొన్ని సమస్యలు ఉంటాయని అంటున్నారు.
జాగింగ్ అంటేనే.. సౌకర్యంగా పరిగెత్తడం. స్థిరమైన, తక్కువ వేగాన్ని మెయింటెయిన్ చేయడం. వ్యాయామం చేస్తున్నప్పుడు ఆయాసం లేకుండా పక్కవారితో మాట్లాడగలుగుతుంటే.. అది ‘సౌకర్యవంతమైన వేగం’ అని అర్థం చేసుకోవాలి. కొత్తగా వ్యాయామం మొదలుపెట్టే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యం మెరుగు పడాలనుకునే వారికి.. జాగింగ్ మేలు చేస్తుంది. అలా కాకుండా, వేగంగా పరిగెడితే.. అది రన్నింగ్ అవుతుంది. సాధారణ వ్యాయామం కాకుండా పోతుంది. ఇది అథ్లెట్లు, కండరాల సామర్థ్యం పెరగాలనుకునే వారికే ప్రయోజనం కలిగిస్తుంది. అయితే, ఇందుకు తగినంత ప్రాక్టీస్ కావాలి. సాధారణ వ్యక్తులు సరైన పద్ధతి పాటించకుండా రన్నింగ్ చేస్తే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
జాగింగ్ మాత్రమే చేయాలనుకునేవారు కచ్చితంగా సౌకర్యవంతమైన వేగంతోనే మొదలుపెట్టాలి. శరీరం అలవాటు పడ్డాక క్రమంగా వేగాన్ని పెంచవచ్చు. ఇక మొత్తం వర్కవుట్లో 80 శాతం సౌకర్యంగా, నెమ్మదిగా పరిగెత్తాలి. కేవలం 20 శాతం సమయం మాత్రమే వేగంగా పరిగెత్తడం మంచిది.