Foods To Prevent Cancer | ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్య వేగంగా పెరుగుతోందని, మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలే ఇందుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు కొన్ని ఆహార పదార్థాలను సూచించారు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చని వారు తెలియజేస్తున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరంలో వాపు తగ్గడం, జీర్ణాశయ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కణాలు దెబ్బతినకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యులు సూచించిన ఆహారాల్లో పర్పుల్ స్వీట్ పొటాటో (ఊదా రంగు గడ్డలు) ముఖ్యమైనవి. ఇవి ఆంథోసయనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గించి, కణాలను నష్టం నుంచి కాపాడుతాయి. ల్యాబ్ అధ్యయనాల ప్రకారం ఇవి పెద్ద పేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేస్తాయి. అలాగే బ్రోకలీ స్ప్రౌట్స్, మైక్రోగ్రీన్స్‌ను కూడా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని డిటాక్స్, యాంటీ ఆక్సిడెంట్ వ్యవస్థలను చురుకుగా చేస్తుంది. సాధారణ బ్రోకలీతో పోలిస్తే వీటిలో ఈ పోషకాలు 20 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా కివీ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి, ఫైబర్, పాలీఫినాల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే డీఎన్ఏ రక్షణలో కూడా ఇవి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో కివీ కీలక పాత్ర పోషిస్తుంది.
గ్రీన్ టీని కూడా రోజువారీ అలవాటులో భాగం చేసుకోవడం మంచిది. ఇందులో EGCG అనే సమ్మేళనం ఉండి ట్యూమర్‌ను అణచే మార్గాలను ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తాగే వారిలో క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకు అవసరమైన 25 నుంచి 38 గ్రాముల ఫైబర్‌లో అధిక భాగాన్ని బీన్స్ ద్వారా పొందవచ్చు. ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే క్యాన్సర్ నివారణకు ఒక్క ఆహారం సరిపోదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్ నివారణ అనేది ఒకే ఒక్క సూపర్ ఫుడ్ వల్ల సాధ్యం కాదని, ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉండాలని, క్రమబద్ధమైన అలవాట్లు ముఖ్యమని వైద్యులు తెలియజేస్తున్నారు.