Heart Diseases | గుండె జబ్బులు ఒక్కసారిగా వచ్చే సమస్యలు కావు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి అంశాల ప్రభావంతో అవి నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. చాలా సందర్భాల్లో లక్షణాలు కనిపించేలోపే ప్రమాదం పెరిగిపోతుంది. అయితే ఇంట్లోనే సులభంగా చేసే ఒక కొలత ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఒక సాధారణ కొలత టేప్ ఉంటే సరిపోతుంది. ఇందులో నడుము చుట్టుకొలత (Waist Circumference)ను ఎత్తుతో (Height) పోల్చి చూడాలి. సాధారణంగా నడుము చుట్టుకొలత, వ్యక్తి ఎత్తులో సగం కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అది ఎత్తులో సగానికి మించి ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొలతకు ముఖ్యమైన కారణం నడుము భాగంలో పేరుకుపోయే అంతర్గత కొవ్వు (విస్సరల్ ఫ్యాట్). ఇది చర్మం కింద ఉండే సాధారణ కొవ్వుతో పోలిస్తే శరీరంలో ఎక్కువ హానికర ప్రభావం చూపుతుంది. ఈ కొవ్వు శరీరంలో వాపులను పెంచే రసాయనాలను విడుదల చేస్తూ గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పొట్ట భాగంలో అధిక కొవ్వు ఉన్నవారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ పరీక్షను చేయడానికి ముందుగా పొట్టను లోపలికి లాగకుండా సహజంగా శ్వాస విడిచిన తర్వాత బొడ్డు ఉన్న స్థాయిలో నడుము చుట్టుకొలతను కొలవాలి. అనంతరం ఎత్తును కొలిచి, నడుము కొలతను ఎత్తుతో భాగించాలి. ఈ నిష్పత్తి 0.5 కంటే ఎక్కువగా వస్తే గుండె ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించాలి. అలాంటి పరిస్థితిలో వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఈ ఒక్క పరీక్షతోనే గుండె జబ్బు ఉందని నిర్ధారించలేమని, ఇది కేవలం ప్రారంభ స్థాయి ప్రమాద సూచిక మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఇది సులభమైన మొదటి అడుగుగా ఉపయోగపడుతుంది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, సరైన చికిత్స ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.