Exercise | నిత్యం వ్యాయామం చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. బరువును నియంత్రించడంలో, శారీరక దృఢత్వాన్ని పెంచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం మెరుగుపడటంలో, మూడ్‌ను సరిచేయడంలో కూడా వ్యాయామం సహాయపడుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు తాజా పరిశోధన ప్రకారం వ్యాయామం జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును కూడా గణనీయంగా మెరుగుపరుస్తుందని వెల్లడైంది. బ్రెయిన్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కేవలం 20 నిమిషాల వ్యాయామం చేసినా మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం మరింత సమర్థవంతంగా జరుగుతుందని తేలింది. వ్యాయామం మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో మనుషులలో నేరుగా నిరూపించిన మొదటి పరిశోధనల్లో ఇదొకటి. ముఖ్యంగా మెమరీకి సంబంధించిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌పై వ్యాయామం ప్రభావం ఎలా ఉంటుందో ఈ అధ్యయనం స్పష్టతనిచ్చింది.
ఈ పరిశోధనలో 17 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఎపిలెప్సీ రోగులను పరిశీలించారు. వీరి మెదడులో ఇప్పటికే చికిత్స భాగంగా ఎలక్ట్రోడ్లు అమర్చబడి ఉండటం వల్ల, హిప్పోక్యాంపస్, కార్టెక్స్ ప్రాంతాల నుండి నేరుగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను నమోదు చేసే అవకాశం లభించింది. వారు వ్యాయామానికి ముందు విశ్రాంతి తీసుకోవడం, 20 నిమిషాలు స్టేషనరీ సైకిల్‌పై వ్యాయామం చేయడం, తరువాత మళ్లీ విశ్రాంతి తీసుకోవడం వంటి దశల్లో ఈ పరిశీలనలు జరిపారు. ఈ అధ్యయనం కొన్ని కీలక విషయాలను బయటపెట్టింది. వ్యాయామం చేసిన తరువాత హిప్పోక్యాంపస్‌లో రిపుల్స్ అనే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సంఖ్య పెరిగింది. అంటే మెదడు మరింత ఎక్కువ సమాచారాన్ని పంపించడం ప్రారంభించింది. అలాగే హిప్పోక్యాంపస్, కార్టెక్స్ మధ్య కమ్యూనికేషన్ బలపడింది. ఈ రెండు ప్రాంతాలు ఒకే తరంగదైర్ఘ్యంలో పని చేయడం వల్ల సమాచార మార్పిడి మరింత సమర్థవంతంగా మారింది.
ముఖ్యంగా ఈ మెరుగుదల మెమొరీకి సంబంధించిన నెట్వర్క్లలోనే కనిపించింది. అంటే వ్యాయామం మెమొరీ నిర్మాణానికి అవసరమైన మెదడు ప్రక్రియలను ప్రత్యేకంగా ఉత్తేజపరుస్తుందన్నమాట. రిపుల్స్ అనేవి మెదడులో ఏర్పడే చిన్న ఎలక్ట్రికల్ తరంగాలు. ఇవి మెమొరీని నిర్మించడంలో, గుర్తు చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఇవి నిద్రలో లేదా విశ్రాంతి సమయంలో కనిపిస్తాయి. వ్యాయామం వీటి కార్యకలాపాలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వ్యాయామం తీవ్రత కూడా ఇందులో ప్రభావం చూపుతుంది. హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రిపుల్ కార్యకలాపం మరింత బలంగా కనిపించింది. అంటే కొంచెం కష్టమైన వ్యాయామం మెదడుకు ఇంకా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్నమాట.
ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. వ్యాయామం కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడు పనితీరుకు కూడా ఎంతో అవసరం. మెమొరీ మెరుగుపడటానికి, ఆలోచన స్పష్టత పెరగటానికి వ్యాయామం సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ కొంత సమయం శారీరక కార్యకలాపాలకు కేటాయించడం ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.