Lump in Breast | మనలో చాలా మంది శరీరంలో కణితులు కనిపించగానే అవి క్యాన్సర్కు సంబంధించినవేమో అని భయపడిపోతుంటారు. రొమ్ములో చిన్న గడ్డలాంటిది కనిపించినా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చేమోనని అనుమానపడుతుంటారు. అయితే, వాస్తవంగా శరీరంలో ముఖ్యంగా రొమ్ములో కనిపించే ప్రతీ కణితి క్యాన్సర్ వల్ల ఏర్పడింది కాదని పరిశోధకులు సెలవిస్తున్నారు. రొమ్ములోని ప్రతి కణితి లేదా గడ్డ క్యాన్సర్ కాదు. హానికరం కానీ కణితులు శరీరంలోని అనేక భాగాల్లో అనేక టిష్యూల నుంచి ఏర్పడుతాయి. నరాలు, రక్తం, ఎముకల నుంచి కూడా ఈ రకం ట్యూమర్లు ఏర్పడుతాయి. ఈ తిత్తుల్లో 90 శాతం మనకు హాని చేయనివే ఉంటాయి.
తిత్తులు ముఖ్యంగా బినైన్, మాలిగ్నంట్ ప్రీ మాలిగ్నంట్.. మూడు రకాలుగా ఉంటాయి. బినైన్ అంటే క్యాన్సర్ కాదు. అయితే, ప్రీ మాలిగ్నంట్ అంటే క్యాన్సర్కు తొలి దశగా ఉంటుంది. మాలిగ్నంట్ అంటే క్యాన్సర్ ట్యూమర్. ఇవన్నీ వేరు వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే వేరు వేరు చికిత్సాపద్ధతులు ఉంటాయి. క్యాన్సర్ కాని కణితులు నిదానంగా పెరుగుతాయి. వీటి వల్ల ఎలాంటి నొప్పి ఉండదు. ముట్టినప్పుడు గట్టిగా ఉండవు. చుట్టుపక్కల ఉండేవాటిలోకి చొచ్చుకుపోవు. మరో భాగానికి పాకవు. వీటికి సాధారణంగా ఎలాంటి చికిత్స అవసరం లేదు. అయితే, ఈ కణితులు 5 సెం.మీ కన్నా పెద్దగా మారినప్పుడు అవి క్యాన్సర్కు దారితీసే అవకాశాలుంటాయి.
రొమ్ముల్లో క్యాన్సర్ కాని గడ్డలు, తిత్తులు, ఫైబ్రోడెనోమాలు నిరాపయకరమైనవి. ఫ్యాట్ నెక్రోసిస్, స్క్లెరోసింగ్ సహా అనేక ఇతర వ్యాధులు ఉన్నవారిలో కూడా గడ్డలు కనిపిస్తాయి. ఇలాంటి తిత్తులు ముఖ్యంగా యువతుల్లోనే ఉంటాయి. రుతుచక్ర సంబంధ మార్పులతో రొమ్ముల్లో ఏదో ద్రవం నిండినట్లుగా ఉండే తిత్తులు ఏర్పడతాయి. వీటిని ముట్టుకుంటే మంట, నొప్పి, ఇబ్బందిగా ఉంటుంది. మరో వారంలో రుతుస్రావం ఉంటుందనగా ఇలాంటి కణితులు కనిపిస్తాయి. రుతుస్రావం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి.
ఫైబ్రో ఎడినోమాస్ కొంచెం గట్టిగా ఉండే కణుతులు. గుండ్రంగానూ, ముట్టుకోగానే లోపలికి జారిపోతున్నట్లుగానూ కనిపిస్తాయి. ఇవి కూడా హానికరం కావు. సాధారణంగా 20-30 ఏండ్ల వయసున్న మహిళల్లో ఇలా హానికరం కాని గడ్డలే ఎక్కువగా ఉంటాయి. మహిళలు స్వీయ రొమ్ము పరీక్షలు చేసుకుంటూ ఏదైనా అసాధారణ అంశం కనిపించగానే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. అలాగే, ప్రతీ ఏటా మామోగ్రామ్తోపాటు శారీరక పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ అవి హానికరమైన గడ్డలే అయినా, తొలిదశలో గుర్తిస్తే హానికారక గడ్డలనూ పూర్తిగా తొలగించి, నయం చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉన్నందున వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవరసమే లేదు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.