మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి సైకోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు చాలామంది. అయితే, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొందరిలో డిప్రెషన్ లక్షణాలు తగ్గవు. అలాంటివాళ్లకు మ్యాజిక్ పుట్టగొడుగుల ట్రీట్మెంట్ చేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారని మెడిసినల్ జర్నల్‌లో వచ్చిన ఒక స్టడీ చెప్తోంది. లండన్‌కి చెందిన కంపాస్ పాథ్వేస్ అనే మెంటల్ హెల్త్ కేర్ కంపెనీ ఈ స్టడీ చేసింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న 233మందిని రెండు గ్రూపులగా చేసి, కొందరికి సిలోసిబిన్ అనే మ్యాజిక్ పుట్టగొడుల్ని 25 మిల్లీ గ్రాముల డోస్ ఇచ్చారు. మిగతావాళ్లకు తక్కువ డోస్ ఇచ్చారు. మూడు వారాల తర్వాత రెండు గ్రూపుల వాళ్లని గమనించారు. 25 మి.గ్రా. సిలోసిబిన్ తీసుకున్నవాళ్లలో డిప్రెషన్ లక్షణాలు తగ్గడం గమనించారు పరిశోధకులు.
మెదడు భాగాల మీద పనిచేసి
‘సిలోసిబిన్లోని సైకోయాక్టివ్ పదార్థాలు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే మెదడు భాగం మీద ప్రభావం చూపిస్తాయి. దాంతో ఒత్తిడి లక్షణాల్ని తగ్గిస్తాయి’ అని చెప్తున్నాడు ఈ స్టడీలో పాల్గొన్న జేమ్స్ రుకర్ అనే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. అయితే, ఈ మ్యాజిక్ పుట్టగొడుగుల పరిశోధన ప్రస్తుతం మధ్యస్త దశలో ఉంది. ఇవి అందుబాటులోకి వస్తే డిప్రెషన్ సమస్య ఉన్నవాళ్లు తొందరగా కోలుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.