Back Pain | ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వెన్నునొప్పి బాధించడం సహజమే. అయితే, ఒకప్పుడు పెద్దవాళ్లలో కనిపించే వెన్నునొప్పి సమస్యలు ఇప్పుడు అన్ని వయసు వారిలో కనిపిస్తున్నాయి. యుక్తవయసు వారే కనీసం 10 నిమిషాల సేపు నిలబడలేకపోతున్నారు. కుర్చీ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నింటికి మన అలవాట్లే కారణం అని చెప్పుకోవచ్చు. ఈ అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా వెన్నునొప్పి రాకుండా చూసుకోవచ్చునంటున్నారు వైద్యనిపుణులు.
వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. వీపు కింది భాగంలో ఉండే కండరాలు, లిగమెంట్స్పై మనకు తెలియకుండానే విపరీతంగా సాగేలా చేస్తాం. దాంతో వాటిపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పికి దారితీస్తుంది. సాధారణంగా వెన్నునొప్పి రోజంతా ఉంటుంది. కొందరిలో రాత్రిళ్లు మాత్రమే వస్తుంది. మరికొందరిలో ఎలాంటి పనిచేసినా నొప్పి బాధిస్తుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, ఎక్కువ సమయం నిల్చున్నా వీపు భాగంలో నొప్పి కనిపిస్తుంటుంది. నిలువుగా నిల్చున్న సమయాల్లో వీపు కిందిభాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే, కండరాలు గట్టిగా చలించడం కూడా చూడొచ్చు. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు మెడలో, వీపు పైభాగంలో, వీపు కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. కొన్ని మన అలవాట్లను మానుకోవడం ద్వారా వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడొచ్చునని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటంటే..
నిత్యం వ్యాయామం..
నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలను కదిలించడం, సాగదీయడానికి సాయపడుతుంది. ఇది శరీరం ఆరోగ్యకరమైన కదలికకు అవసరం. వెన్నునొప్పిని అరికట్టడానికి వెన్ను, వెన్నెముకను లక్ష్యంగా చేసుకునే వ్యాయామాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అయితే, వెన్నుపై ఎక్కువ భారం పడకుండా చూసుకోవడం చాలా అవసరం.
కూర్చునే భంగిమ..
ఇది చాలా చిన్నవిషయంగా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో వెన్నునొప్పిని తగ్గించడంలో మనం కూర్చునే భంగిమ ఎంతో సహాయపడుతుంది. కంప్యూటర్‌పై పనిచేసే చాలా మంది ముందుకు సాగిలబడి కూర్చుంటారు. ఈ భంగిమ మనలో అసమతుల్యతను సృష్టిస్తుంది. అలాకాకుండా వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పనిచేయకుండా మధ్యమధ్య లేచి నడవాలి.
విటమిన్ డీ అండ్ కాల్షియం..
ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, విటమిన్ డీ అవసరం. బలహీనమైన ఎముకలు వయసు పెరిగేకొద్దీ బోలు ఎముకల వ్యాధికి కారణమవుతాయి. ముఖ్యంగా మహిళల్లో వెన్నునొప్పికి దారితీస్తుంది. పాలు, పెరుగు, ఆకుకూరలు.. కాల్షియం కలిగి ఉండే కొన్ని వస్తువులు. చేపలు, గుడ్డు సొనలు, జున్నులో విటమిన్ డీ లభిస్తుంది. నిత్యం భోజనంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఎముకలను బలంగా తయారుచేసుకోవచ్చు.
సౌకర్యవంతమైన బూట్లు..
కాళ్లకు ధరించే బూట్ల ఎంపిక కూడా మన ఆరోగ్యం విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలుకు సరిపోనివి, ఎత్తు మడమల బూట్లు ధరించడం వల్ల నిలబడి ఉన్నప్పుడు వీపుపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వెన్నునొప్పి వస్తుంది. అందుకని సౌకర్యవంతమైన బూట్లే ధరించాలి. అలాగే, ఎక్కువగా ఫ్లాట్ బూట్లు ధరించడానికే అవకాశం ఇవ్వండి.
స్మోకింగ్ మానుకోవడం..
సిగరెట్ స్మోకింగ్ మన ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయో తెలిసినా మనం ఆ అలవాటును మానుకోం. సిగరెట్ స్మోకర్లలో వెన్నునొప్పి ఎక్కువగా వస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్ వెన్నెముక డిస్క్‌లకు రక్త ప్రవాహాన్ని తగ్గించి కండరాలను బలహీనం చేస్తుంది. ఫలితంగా చిన్న వయసులోనే వెన్నునొప్పిని భరించాల్సి వస్తుందని గుర్తుంచుకొని సిగరెట్ స్మోకింగ్ మానుకోవాలి.
సరైన శరీరం బరువు..
ఊబకాయం ఉన్నవారు నడుం నొప్పిని ఎక్కువగా అనుభవిస్తుంటారు. ఎందుకంటే శరీరం బరువు వారి దిగువ వీపుపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకని వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే శరీరం బరువు తగ్గించుకోవడంపై దృష్టిసారించాలి.
నిద్రా భంగిమలు..
ప్రతిరోజూ వెన్నునొప్పి వేధిస్తుండటంతో నిద్రపోయే విధానం గురించి వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. నిద్రపోయేటప్పుడు మోకాళ్ల క్రింద, వీపు కింద ఒక దిండు పెట్టుకోవాలని వైద్యులు సూచించవచ్చు. బోర్లా పడుకోవడం మానుకోవడం మానుకోవాలి. లేదంటే ఇది వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.
ఒత్తిడిని వదిలేయాలి..
ఒత్తిడి శరీరానికే కాకుండా వెన్నుకు కూడా హానికరం. ఒత్తిడి కండరాలలో ఉద్రిక్తతను పెంచి చివరికి వెన్నునొప్పికి దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం అభ్యసించడం మంచి ప్రత్యామ్నాయం. ఇది వెన్నునొప్పిని నివారించడంలో సహాయపడుతుందని గుర్తించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.