Chemotherapy | రామబాణం.. కీమో!

క్యాన్సర్ చికిత్స.. ప్రాణాంతక మహమ్మారితో మనిషి జరిపే యుద్ధం. ఆ పోరాటంలోవైద్యుడు సర్వ సైన్యాధ్యక్షుడు. ఔషధాలు మర ఫిరంగులు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగులూ గూఢచారులు. ఆ మొండి వ్యాధి ఏ చికిత్సకూ లొంగనప్పుడు.. నిపుణులు ప్రయోగించే రామబాణం కీమోథెరపీ. నిజమే, దీనివల్ల కొన్ని చెడు ప్రభావాలు ఉండవచ్చు. కానీ, అంతిమంగా రోగికి మంచే జరుగుతుంది. సరిహద్దు చొరబాటుదారుల్లా కణకణాల్లోకి చొచ్చుకొస్తున్న రుగ్మతను కట్టడి చేయగల శక్తి కీమో థెరపీకే ఉంది.
క్యాన్సర్ అని తెలియగానే, ‘ఇదేం ఖర్మరా బాబూ!’ అనుకుంటారు చాలామంది. కొంతమందిలో ఇది ‘ఖర్మ’ వల్లే సంభవించినా, చాలామందిలో మాత్రం దీనికి కారణం ‘కర్మే’. అవును, ‘ఖర్మ’కి, ‘కర్మ’కి మధ్య ‘అర్థానికి’, ‘అపార్థానికి’ ఉన్నంత వ్యత్యాసం ఉంది. రెండూ వేరువేరు పదాలు. కర్మ అనేది శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా జరిగే నిరంతర ప్రక్రియ. ‘మీ జీవితం మీ కర్మ’ అని బల్లగుద్ది చెబుతారు. అంటే మనం చేసే పనులను బట్టే, మనకు ఎదురయ్యే ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు.. శారీరక దృఢత్వం లేకపోవడం, మానసికంగా ఆహార అలవాట్ల మీద అదుపు లేకపోవడం, వ్యసనాలకు బానిస కావడం, భావోద్వేగానికి లోనై ఒత్తిడికి గురికావడం. ‘ఖర్మ’ అనే పదానికి వాడుకలో ఉన్న ప్రయోగం- ‘ఇదంతా నా తలరాత, నా ఖర్మ’. అంటే మనం మార్చుకోలేని, మనం తప్పించుకోలేని విషయాలు. ఉదాహరణకు.. మన శరీరంలో జరిగే జన్యు మార్పులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, కలుషిత వాతావరణం, కలుషిత ఆహారం లాంటివి అన్నమాట. కర్మ, ఖర్మం.. కారణం ఏదైనా, క్యాన్సర్‌బారిన పడిన ప్రతి మనిషీ రుగ్మతతో యుద్ధం చేయాల్సిందే. ఆ యుద్ధానికి మనకున్న మూడు
ప్రధాన ఆయుధాలు..
- శస్త్రచికిత్స
- రేడియేషన్
- కీమోథెరపీ
…ఈ మూడూ క్యాన్సర్‌ను అధిగమించడానికి తోడ్పడతాయి. అదనంగా, కీమోథెరపీ కంటికి కనిపించని కణాలను నాశనం చేసి, క్యాన్సర్ పునరావృతం కాకుండా చూస్తుంది. ఇదోరకంగా యుద్ధం లాంటిదే. ఏ యుద్ధానికి అయినా మూలకారణం ఒకటే ధర్మాన్ని పాటించకపోవడం. కణాల నియంత్రణ అనేది మన శరీర ధర్మం. క్యాన్సర్ కణాలు మన శరీరంలోని నియంత్రణ వ్యవస్థను ఎదిరించి, హద్దూ అదుపూ లేకుండా విస్తరిస్తున్నప్పుడు యుద్ధం అనివార్యం. ఆ సమయంలో ధైర్యంగా పోరాడాల్సిందే. లేకపోతే, మన ప్రాణానికే ప్రమాదం. క్యాన్సర్‌పై మనిషి జరిపే ఆ పోరాటంలో బ్రహ్మాస్త్రం – ‘కీమోథెరపీ’.
ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా కీమోథెరపీ ఇంజక్షన్ రూపంలో ఉంటుంది. కొన్ని క్యాన్సర్ల విషయంలో టాబ్లెట్ రూపంలోనూ దొరుకుతుంది. కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాల నిర్మూలన, నియంత్రణ జరుగుతుంది. సమూల నిర్మూలన జరిగితే క్యాన్సర్ పునరావృతం కాదు. సమర్థ నియంత్రణ జరిగితే క్యాన్సర్ అదుపులో ఉంటుంది. కొంతమందిలో కీమోథెరపీ వల్ల కణ పరిమాణం తగ్గిపోయి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో ఉన్నవారికి, రక్త క్యాన్సర్ రోగులకు ఒకే ఒక్క ఆశాకిరణం కీమోథెరపీ. క్యాన్సర్ పునరావృతం అయినప్పుడు, అది మిగతా అవయవాలకు సోకకుండా అదుపులో ఉంచగల శక్తి కూడా కీమోథెరపీకి ఉంది.
శస్త్రచికిత్స లేదా రేడియేషన్‌కు ముందు కీమోథెరపీని మందు రూపంలో ఇవ్వడం వల్ల క్యాన్సర్ పరిమాణం తగ్గిపోతుంది. దీంతో శస్త్రచికిత్స లేదా రేడియేషన్ చికిత్సకు అనువైన పరిస్థితి ఏర్పడుతుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ తర్వాత కంటికి కనిపించని క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలోనూ కీమోథెరపీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. రేడియేషన్ సమర్థంగా పనిచేయడానికి కూడా కీమోథెరపీ దోహద పడుతుంది.
దుష్ప్రభావాలూ ఉన్నాయి..
ప్రభావం ఉన్న ప్రతి చోటా దుష్ప్రభావం తప్పనిసరి. ఒక మందుకు ఎలాంటి దుష్ప్రభావమూ లేదంటే దాని సమర్థతను అనుమానించాల్సిందే. కీమోథెరపీ ప్రభావవంతమైంది కనుకనే, దాని దుష్ప్రభావాలూ తీవ్రంగానే ఉంటాయి. కీమోథెరపీ వేగంగా వ్యాప్తి చెందిన క్యాన్సర్ కణాలను మట్టుబెట్టడమే కాకుండా, ఆరోగ్యవంతమైన కణాలను కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నోరు, పేగుతోపాటు వెంట్రుకల పెరుగుదలకు సహకరించే కణాల మీద కీమో ప్రభావం తీవ్రంగా పడుతుంది. అందువల్ల నోట్లో పుండ్లు పడటం, ఆహారం రుచించక పోవడం, నోట్లో నొప్పి లేదా మంట, వికారంగా ఉండటం, వాంతులు, విరేచనాలు, జుట్టు రాలడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. అయితే ఇవన్నీ కొందరిలో, కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తాయి. కీమోథెరపీ రకం, మోతాదు, రోగి శరీరతత్వాలను బట్టి ఈ దుష్ప్రభావాలు కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా కనిపిస్తాయి. కొద్దిమందిలో అసలు ఉండకపోవచ్చు. ఒకవేళ సంభవించినా వైద్యుల సహకారంతో వీటిని ఎదుర్కోవటం పెద్ద కష్టమేం కాదు. యుద్ధం జరిగినప్పుడు శత్రువులు, మిత్రులు.. ఇరు వర్గాల వారికీ ప్రాణనష్టం జరుగుతుంది. కీమోథెరపీ తీసుకున్నప్పుడు సైతం, క్యాన్సర్ కణాలతో పాటు రోగ నిరోధక శక్తికి అవసరమయ్యే తెల్ల రక్తకణాలు కూడా చనిపోతూ ఉంటాయి. తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తగ్గితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే, అవి పేట్రేగిపోయి వైద్యులకు సవాలుగా మారుతాయి.
యుద్ధంలో అంతిమ విజయం ధర్మానిదే. వైద్యుల సలహా పాటిస్తూ, మీ వైపు నుంచి కీమోథెరపీ చికిత్సకు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌పై గెలుపు మీదే.
ఇంట్లో క్యాన్సర్ రోగి ఉంటే..
‘క్యాన్సర్ రోగి ఇంట్లో ఉంటే, కుటుంబ సభ్యులకు ప్రమాదమా?’ అన్న ప్రశ్న ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. వాస్తవానికి క్యాన్సర్ సోకినవారు పసిపిల్లలతో సమానం. వాళ్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల, ఇంట్లో ఎవరైనా తుమ్మినా దగ్గినా అంటు వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి, కీమోథెరపీ తీసుకున్న వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తినకముందు, తిన్న తరువాత, బాత్రూమ్కు వెళ్లిన ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మూతి, ముక్కు, కంటి భాగాలు తాకినప్పుడు చేతులు కడుక్కోవాలి. మిగతా సభ్యులను కూడా ఇలాగే చేయమని చెప్పాలి. మరీ ముఖ్యంగా సెల్‌ఫోన్ తాకిన ప్రతిసారీ చేతులు కడుక్కోవాలి. ఒక అధ్యయనం ప్రకారం.. టాయిలెట్ సీట్ కంటే, సెల్ ఫోన్ మీదే బ్యాక్టీరియా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
- అనారోగ్యంతో బాధపడుతున్న వారి నుంచి క్యాన్సర్ రోగులను దూరంగా ఉంచాలి. పెంపుడు జంతువులను కూడా దూరంగా పెట్టాలి. పదిమందీ కలుసుకొనే ఫంక్షన్లకు వారు వెళ్లకపోవడమే ఉత్తమం.
- బరువు తగ్గకుండా చూసుకోవాలి. వికారంగా ఉండటం, వాంతులు కావడం, ఆహారం రుచించక పోవడం కీమోథెరపీ దుష్ప్రభావాలుగా చెప్పుకోవచ్చు. అయితే, తినాలని అనిపించకపోయినా తినాల్సిందే. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పచ్చి ఆహారం ముట్టుకోకూడదు. బాగా ఉడికించిన, తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అవసరమైతే డైటీషియన్‌ను సంప్రదించాలి. డైట్ ప్లాన్ తప్పకుండా అనుసరించాలి. ఈ దశలో బరువు తగ్గకుండా చూసుకొంటే క్యాన్సర్‌పై సగం విజయం సాధించినట్లే!
- దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించగలిగితే మరీ మంచిది.
- మగవాళ్లు గడ్డం చేసుకోవడానికి బ్లేడ్ వాడకపోవటమే మంచిది. ట్రిమ్మర్ ఉత్తమం.
- రోజూ స్నానం చేయాలి. ముఖ్యంగా మలవిసర్జన తర్వాత శుభ్రత అవసరం.
- కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే.. చాలా వరకు కీమో మందులు శరీరంలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల్లోనే మలం ద్వారానో, మూత్రం ద్వారానో బయటికి వెళ్లిపోతాయి. క్యాన్సర్ రోగులను చూసుకునే వాళ్లు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రోగుల బట్టలు విడిగా వాషింగ్ మెషిన్లో వెయ్యాలి. డైపర్ల లాంటివి పడేయాల్సి వచ్చినప్పుడు ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి పడేయాలి. మల మూత్ర విసర్జన తరువాత రెండుసార్లు ఫ్లష్ చేయటం మంచిది.
- జ్వరంగా అనిపించినప్పుడు థర్మో మీటర్‌తో పరీక్షించుకోవాలి. 100 డిగ్రీలు దాటితే, తక్షణమే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయమే.
- వాంతులు, విరేచనాలు, ఇతర సమస్యలు ఒకరోజు కన్నా ఎక్కువగా ఉంటే, వైద్యులను సంప్రదించాలి.
- క్యాన్సర్ రోగుల మలం, మూత్రం, రక్తం వంటివి తాకాల్సి వచ్చినప్పుడు రెండు జతల గ్లవ్స్ (చేతి తొడుగులు) తొడుక్కోవడం మంచిది.
- నీళ్లు బాగా తాగాలి. కాచిన, గోరు వెచ్చని నీళ్లు ఉత్తమం.
డా. ఉదయ్ కుమార్ పుణుకొల్లు
సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్
&హెమటో-ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
మలక్ పేట్, హైదరాబాద్.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Cancer
- chemotherapy
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

