కన్నీళ్లు కార్చడం కోసం నటులు గ్లిజరిన్ ఉపయోగిస్తారని తెలిసిందే. అదే గ్లిజరిన్ నవ్వులు కూడా తెప్పిస్తుందని తెలుసా? చాలామంది నవ్వలేక ఏడుస్తారు. నవ్వితే నోటి దుర్వాసనతో ఎదుటివాళ్లు ఏమనుకుంటారోనని నవ్వలేరు. నవ్వు ఆపుకోలేక నవ్వితే ఎదుటివాళ్లు నవ్వారని ఏడుస్తారు. ఇలాంటి సంకట స్థితిలో ఆ దుర్వాసనకు విరుగుడు గ్లిజరిన్. నోటి దుర్వాసనతో దీర్ఘకాలంగా బాధపడుతున్నవారికే కాదు వెల్లుల్లి, ఉల్లి తిన్నతర్వాత కూడా నోటి దుర్వాసన వస్తుంది.
ఈ రెండు రకాల దుర్వాసనలకు గ్లిజరిన్ చెక్ పెట్టేస్తుంది. గోరువెచ్చని నీటిలో గ్లిజరిన్ (గ్లిజరాల్) కలిపి కాసేపు పుక్కిలిస్తే దుర్వాసన మాయమైపోతుందట. ఉల్లి, వెల్లుల్లిలో గంధకం (సల్ఫర్) సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు అమైనో ఆమ్లాలు, ఇతర ఆమ్లాలుగా మారతాయి. నోటి దుర్వాసన రావడానికి కారణం ఇవే. గ్లిజరిన్‌తో నోటిని తడపడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుంది.
చిగుళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన ఉంటే గ్లిజరిన్‌తో చేసిన మౌత్‌వాష్‌లు, టూత్‌పేస్టులు కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే, నోటి దుర్వాసన పోగొట్టే ప్రయత్నంలో గ్లిజరిన్ గొంతులోకి పోకుండా చూసుకోవాలి. లేదంటే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, గొంతులో మంట వంటి సమస్యలు వస్తాయి.