భోజనం చేయగానే చాయ్, కాఫీలు తాగడం ఏమంత మంచి అలవాటు కాదు. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించడంలో అవరోధం కలుగుతుంది. కెఫీన్ ప్రభావంతో పిల్లలు నిద్రలేమికి గురవుతారు కూడా.
మద్యపానం, ధూమపానం తదితర అలవాట్లు బాలింతతోపాటు బిడ్డకూ హానికరమే. చనుబాలతోపాటు పొట్టలో చేరుకునే హానికర పదార్థాలు ఎదుగుదలను అడ్డుకుంటాయి. మానసిక వికాసానికి అవరోధాలు సృష్టిస్తాయి.
తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందన్న కారణంతో బాలింతలు మంచినీళ్లు తాగేందుకు సందేహిస్తారు. దీంతో చనుబాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
పాలివ్వడం వల్ల తల్లిలో క్యాల్షియం లోపం ఏర్పడుతుందన్న మాటలో కొంత నిజం ఉంది. అయితే, పోషకాహారంతో ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
తల్లులు ఊబకాయం, మధుమేహం, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ తదితర రుగ్మతలకు దూరంగా ఉంటారని, ఒత్తిడులను సునాయాసంగా అధిగమిస్తారని అధ్యయనాల సారాంశం.