WORLD AIDS DAY | హెచ్ఐవీ.. హ్యూమన్ ఇమ్యునో డెఫషియన్సీ వైరస్ (Human Immuno deficiency Virus). ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరచి అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. హెచ్ఐవీ వైరస్ తీవ్రమైతే అది ఎయిడ్స్ (AIDS) కు దారి తీస్తుంది. హెచ్ఐవీ శరీరం కణాల డీఎన్ఏలోకి చేరుతున్నందున ఒకసారి ఈ వైరస్ సోకితే అది జీవితాంతం ఉండిపోతుంది. హెచ్ఐవీ ఉన్న ప్రతి వారికీ ఎయిడ్స్ డెవలప్ అవ్వాలనే రూలేం లేదు. కానీ, ఎలాంటి ట్రీట్మెంట్ లేకపోతే ఈ పరిస్థితిలో మూడేండ్ల కంటే ఎక్కువ కాలం జీవించడం కష్టం. అయితే, యాంటీ రెట్రోవైరల్ థెరపీతో హెచ్ఐవీని మేనేజ్ చేయడం తేలికే. అప్పుడు, సాధారణ పౌరుల్లాగే సుమారుగా హెచ్ఐవీ వ్రాధిగ్రస్తుల జీవిత కాలం కూడా ఉంటుంది.
హెచ్ఐవీ వల్ల సీడీ4 సెల్ కౌంట్ తగ్గిపోతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. సాధారణ వ్యక్తిలో ఒక క్యూబిక్ మిల్లీమీటర్‌కు 500-1500 వరకూ సీడీ4 కౌంట్ ఉంటుంది. ఈ కౌంట్ 200 కంటే తక్కువగా ఉంటే ఎయిడ్స్ ఉన్నదని నిర్ధారిస్తారు. ఎంత తొందరగా హెచ్ఐవీ క్రానిక్ స్టేజ్ ద్వారా ప్రొగ్రెస్ అవుతుందనేది వ్యక్తిని బట్టి మారుతుంది.
హెచ్ఐవీ ఎలా సోకుతుంది..?
సురక్షితం కాని శృంగారం వల్ల
వెజైనల్ లేదా యానల్ శృంగారం వల్ల
నీడిల్స్, సిరంజీలు షేర్ చేసుకోవడం వల్ల
స్టెరిలైజ్ చేయని పరికరాలతో పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల
బ్రెస్ ఫీడింగ్ వల్ల
ప్రెగ్నెన్సీ, డెలివరీ వల్ల
పరీక్షలు జరుపని రక్తం ఎక్కించడం వల్ల
హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించడం వల్ల
హెచ్ఐవీ ఇలా సోకదు..
స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల
కౌగిలింత, హ్యాండ్‌షేక్, ముద్దు పెట్టుకోవడం వల్ల
గాలి, నీరు వల్ల
ఫుడ్, డ్రింక్ షేర్ చేసుకోవడం వల్ల
టవల్స్, బెడ్స్ షేర్ చేసుకోవడం వల్ల
దోమకాటు వల్ల
పోషకాహారంతో సెల్ హీలింగ్..
హెచ్ఐవీతో బాధపడుతున్నవారు ఆరోగ్యకరమైన జీవితాన్ని లీడ్ చేసేందుకు పోషకాహారాలను తీసుకోవాలి. వ్యాధినిరోధక వ్యవస్థ బలంగా మారేందుకు సహకరించే రంగురంగుల కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటుండాలి. అలాగే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వల్ల హెచ్ఐవీ ప్రభావాన్ని తగ్గించుకునే వీలుంటుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, తక్కువ మొత్తంలో కొవ్వులను కలిగి ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. వీటితోపాటు సెల్ హీలింగ్‌కు మద్దతుగా నిలిచేందుకు విటమిన్లు, సూక్ష్మపోషకాలు విటమిన్ సీ, డీ, ఈ, సెలేనియం, బీ విటమిన్లు, జింగో బిలోబా, మిల్క్ తిస్టిల్, వలేరియా, ఫోలేట్, బీటా కారోటీన్ ఉండే ఆహారాలు తింటుండాలి.
శారీరక వ్యాయామంతో చురుగ్గా జీవితం..
నిత్యం వ్యాయామం చేయడం అలవర్చుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనడం ద్వారా అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటీస్‌తోపాటు అనేక రకాల క్యాన్సర్లు అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తక్కువ తీవ్రత గల వ్యాయామాలు చేస్తూ వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేసుకోవచ్చు.
సురక్షిత శృంగారంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట..
ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో సురక్షితం కాని శృంగారం చేయడం వల్ల హెచ్ఐవీ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు కండోమ్‌లు వినియోగించకుండా చేసే శృంగారం వల్ల సంభవిస్తాయి. ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD), ఇతర రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని, మీ భాగస్వామిని రక్షించుకోవడానికి గర్భనిరోధకాలు ధరించడం కీలకం అని గుర్తుపెట్టుకోవాలి.
మెంటల్, ఎమోషనల్ వెల్బీయింగ్..
హెచ్ఐవీ ఉన్న వారు చికిత్స పొంది తిరిగి సాధారణ జీవితం గడపడం అనేది వారి సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. నిత్యం సవాళ్లను ఎదుర్కొనే మానసిక దృఢత్వం కలిగిఉండాలి. సమస్య పట్ల స్పష్టతతో ఉండాలి. ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ఈ వ్యాధి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకని ఒత్తిడిని చిత్తుచేసేలా పట్టుదలతో ఉండాలి. టెన్షన్, నిరాశ ఎదురవకుండా చూసుకోవాలి. హెచ్ఐవీ ఎదర్కొంటున్న వ్యక్తులకు వారి కుటుంబసభ్యులు అండగా ఉండాలి. తరచుగా మాట్లాడుతూ ఉండటం వల్ల వారిలో ఒత్తిడిని దూరం చేయవచ్చు. తద్వారా మానసికంగా దృఢత్వాన్ని సాధిస్తారు.
నోటి పరిశుభ్రతతో పూర్తి ఆరోగ్యం..
హెచ్ఐవీ ఉన్నవారిలో నోటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని, నోటి పరిశుభ్రతను పాటించడం అలవర్చుకోవాలి. హెచ్ఐవీ-పాజిటివ్ కలిగిన వ్యక్తి ఆరోగ్యంపై దంతాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మంచి నోటి పరిశుభ్రత కోసం దంత పరీక్షలు చేయించుకోవాలి. భోజనం చేసిన ప్రతిసారీ దంతాల ఫ్లాసింగ్ చేసుకోవాలి. దుర్వాసన పోయేందుకు మౌత్ వాష్ వాడుతుండాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.