మంగళవారం 07 ఏప్రిల్ 2020
Gadwal - Feb 01, 2020 , 00:51:47

‘సహకార’ కసరత్తు

‘సహకార’ కసరత్తు
  • రేపు ఓటర్ల జాబితా ప్రకటన
  • జిల్లాలో 11 వింగిల్‌ విండోలు
  • ప్రక్రియ వేగవంతం చేసిన అధికారులు
  • ఆరుగురు డైరెక్టర్లకు రిజర్వేషన్లు వర్తింపు
  • ప్రతి విండోలో 13మంది డైరెక్టర్లు, చైర్మన్‌
  • 3న రిజర్వేషన్లు ఖరారు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల నగారా మోగించడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రథమంగా చేపట్టాల్సిన ఓటర్ల గణన కార్యక్రమాన్ని చేపట్టారు. సహకార సంఘం ఎన్నికలకు అర్హులైన ఓటర్లను గుర్తించి ఈ నెల 2న ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల ఆధా రంగా విండోలలో ఈ నెల 3న రిజర్వేషన్లు ప్రకటించ నున్నారు. ఒక విండోలో 13 మంది డైరెక్టర్లు నియమించబడనున్నారు. వీరందరూ కలిసి చైర్మన్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు. డైరెక్టర్లలో 6 స్థానాలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. 


ఈ సీజన్‌లో చివరి ఎన్నికలైన సహకార సంఘం ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లా అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. నిబంధన ప్రకారం ఎన్నికలను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేపట్టనున్నారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు ఓటర్లను గుర్తించడం, రిజర్వేషన్లు ఖరారు చేయడం, నోటిఫికేషన్‌ విడుదల చేయడం, నామినేషన్లు స్వీకరించడం, స్క్రూట్నీ నిర్వహించడం, అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం, పోలింగ్‌ చేపట్టడం, కౌంటింగ్‌ నిర్వహించడం వంటి పనులను క్రమం తప్పకుండా చేపట్టేందుకు జిల్లా సహకార సంఘం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 


సహకార సంఘం ఓటర్ల గణన

సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ప్రథమంగా ఓటర్ల గణన చేపట్టారు. సహకార సంఘం ఎన్నికల్లో ఓటు వేసేం దుకు అర్హులైన రైతులకు నూతనంగా ఓటు హక్కు కల్పించి వారిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో లక్షా 20 వేల మంది రైతులు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉండగా వీరిలో 62 వేల మంది రైతులు మాత్రమే సహకర సంఘంలో ఓటుహక్కును కలిగి ఉన్నారు. తాజాగా చేపట్టిన ఓటర్ల గణనలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉండి క్రాప్‌లోన్‌, వంటి వివిధ రకాల లోన్‌లు తీసుకున్న రైతులు మాత్రమే ఓటర్లుగా పరిగణించబడుతారు. ఈ లోన్లు తీసుకొని సంవత్సర కాలం గడిచిన వారికి మాత్రమే అధికారులు నూతనంగా ఓటు హక్కును కల్పిస్తారు. అధికారులు చేపట్టిన ఈ గణన ఆధారంగా ఫిబ్రవరి 2న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. 


ఫిబ్రవరి 3న విండో డైరెక్టర్ల రిజర్వేషన్లు

ఓటర్ల గణన ఆధారంగా ఫిబ్రవరి 3న ఎన్నికల అధికారులు రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఒక విండోలో 13 మంది డైరెక్టర్ల నియామకం చేపట్టగా వీరిలో 6 మందికి రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ ఆరుగురిలో ఎస్సీలకు రెండు స్థానాలు కేటాయించగా వీటిలో ఒక స్థానం మహిళకు కేటాయించనున్నారు. బీసీలకు రెండు జనరల్‌ స్థానాలు కేటాయించ నున్నారు. ఎస్టీలకు ఒక జనరల్‌ స్థానం కేటాయించ నున్నారు. ఓసీ మహిళలకు ఒక స్థానం కేటాయించ నున్నారు. మిగిలిన ఏడు స్థానాలు జనరల్‌గా కేటా యించనున్నారు. ఈ రిజర్వేషన్లను ఓటర్ల గణన ఆధారంగా ఆయా విండో పరిధిలోని గ్రామాల్లో గల ఓటర్లను కుల ప్రాతిపాదికన లెక్కగట్టి ఆయా గ్రామాలకు రిజర్వేషన్లు నిర్ణయించనున్నారు.  సహకార సంఘం ఎన్నికలను పార్టీ గుర్తులతో కాకుండా అధికారులు కేటాయించే గుర్తులతో నిర్వహించనున్నారు. ఎన్నికల  అనంతరం ఎలాంటి రిజర్వేషన్‌ లేకుండా  విండోలోని 13 మంది డైరెక్టర్లలో మోజారిటీ డైరెక్టర్లు ప్రతిపాదించిన డైరెక్టర్‌  చైర్మన్‌గా ఎన్నుకోబడనున్నారు. కనీసం 11 మంది ఓటర్లు ఉంటేనే ఒక విండోగా నిర్ణయించి ఎన్నికలు నిర్వహించనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, ధరూర్‌, మల్దకల్‌, గట్టు, అయిజ, ఇటిక్యాల, మానపాడు, కలుగొట్ల, అలంపూర్‌, క్యాతూర్‌, వడ్డేపల్లిగా మొత్తం 11 సింగిల్‌ విండోలున్నాయి.   


ప్రక్రియ వేగవంతం చేసిన అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో తక్కువ కాల వ్యవధిలోనే అన్ని పనులను పూర్తి చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ సీజన్‌లో సహకారం సంఘం ఎన్నికలో చివరి ఎన్నికలు కావడంతో ఇది వరకు నిర్వహించిన ఎన్నికల మాదిరిగానే విజయవంతగా ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. షెడ్యూల్‌ చేసిన నాటి నుంచే ప్రణాళికలను నిర్వహించేందుకు కాలంతో పోటీ పడి ఏర్పాట్లను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీల వారీగా ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 


logo