Caste Census | సీఎం గారూ.. కులగణన ఎప్పుడు?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా బీసీ కులగణన హామీని నెరవేర్చకపోవడంపై పలు బీసీ సంఘాలు మండిపడ్డాయి.
Caste Census | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా బీసీ కులగణన హామీని నెరవేర్చకపోవడంపై పలు బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఇప్పటివరకు సమగ్ర కులగణన జరపకపోవడం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ కార్యరూపం దాల్చకపోవడంపై ఆయా సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీశారు. విధివిధానాలు ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమవుతుండటాన్ని వాళ్లు తప్పుబట్టడమే కాదు, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం.
గౌరవనీయులైన సీఎం గారికి..
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీనిపై గత రెండు నెలలుగా బీసీ జనసభ, బీసీ కులాలు, బీసీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీ ప్రభుత్వం స్పందించడం లేదు. మొక్కుబడిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి, చేతులు దులుపుకొన్నారే తప్ప ప్రణాళికాబద్ధంగా ఒక కార్యాచరణకు పూనుకోలేదు. పైగా ఈ అంశాన్ని ఇప్పుడు లీగల్ ఇష్యూలోకి నెట్టివేయాలని చూస్తున్నారు. కొం తమంది ప్రైవేట్ వ్యక్తులతో కేసులు వేయించి, ఆలస్యమైతే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని చెప్పించి, ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ కోర్టు ఆదేశాలు వచ్చేలా కుట్రలు చేస్తున్నారు. నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్టుగా మీ వ్యవహారశైలి ఉంది. మీ వైఖరి వల్ల బీసీల రాజకీయ అవకాశాలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది.
ఇటీవల మీరు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని, వీలైతే కులగణన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, మాజీ మంత్రి జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సెలవిచ్చారని వార్తలు వచ్చాయి. ఇక్కడే తమరి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తున్నది. ఎందుకంటే, గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 33 శాతం రిజర్వేషన్లు 22 శాతానికి పడిపోవడానికి ప్రధాన కారకుడనే ఆరోపణలున్నాయి.
2004-2014 వరకు ఉమ్మడి ఏపీలో కొందరు బీసీ వ్యతిరేకులు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 33 శాతం ఉండటం వల్ల రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటుతుందని, అది రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టుకు వెళ్లారు. అదృష్టవశాత్తూ జస్టిస్ రోహిణి బీసీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కానీ, అదే బీసీ వ్యతిరేకులు జస్టిస్ రోహిణి తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ వల్ల స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటుతున్నదని, దాన్ని 50 శాతం పరిమితికి లోబడేటట్టు తగ్గించుకోవాలని హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీనికి ప్రధాన కారణం నాటి ప్రభుత్వం, ముఖ్యంగా అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిలే. ఆయన సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సవాలు చేయకపోవడంతోనే అప్పుడు అన్యాయం జరిగింది. చివరకు 2018లో హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తద్వారా నేడు బీసీల రిజర్వేషన్లు 22 శాతానికి తగ్గే పరిస్థితి వచ్చింది. తమరు కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు జానారెడ్డి సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించడం మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఓటర్ జాబితా ఆధారంగా కులగణన చేద్దామని మీరు చెప్తున్నారు. కానీ, ఓటర్ జాబితాలో ఎక్కడా కుల ప్రస్తావన ఉండదు. కుల అస్తిత్వ ప్రస్తావన లేని ఓటర్ జాబితా ఆధారంగా కులగణన ఎలా చేస్తారు. అశాస్త్రీయంగా కులగణ న చేసి, న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టి, బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకోవాలనే కుట్ర మీ చర్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కులగణన చేసిన విషయం మీకు తెలిసిందే. గతేడాది బీహార్‌లోనూ సమగ్ర కులగణన నిర్వహించడమే కాకుండా ఈడబ్ల్యూఎస్ కలుపుకొని రిజర్వేషన్లను 75 శాతానికి పెంచి, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలు, ఎంబీసీలకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించారు. కాబట్టి, సమగ్ర కులగణన చేయకుండా ఉండేందుకు తమరు దారులు వెతకడం మానేసి, తక్షణమే దాని కోసం విధివిధానాలను రూపొందించాలి. వాటికోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా బీహార్, కర్ణాటక లాంటి రాష్ర్టాలను ఆదర్శంగా తీసుకోవాలి. అందుకోసం సామాజిక వర్గాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన, సామాజిక శాస్త్రవేత్తలు, న్యాయకోవిదులైన ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సలహాలు తీసుకోవాలి.
సమగ్ర కులగణన హామీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టోలో ఉన్నది. సమగ్ర కులగణన చేసి, ఓబీసీ జనాభా లెక్కలు తీస్తామని, తద్వారా అన్నిరంగాల్లో ఎవరి వాటా ఎంతో తేలుస్తామని రాహుల్‌గాంధీ దేశమంతా కలియది రిగి ప్రచారం చేశారు. మీరు మాత్రం కులగణనపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. కులగణన బీసీ సమాజానికి జీవన్మరణ సమస్య. పదే పదే మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు ఇస్తూ.. బీసీ సమాజాన్ని అవమానిస్తున్నది మీరు కాదా? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు ఇవ్వాల్సి ఉన్నది. కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం 34 సీట్లు ఇవ్వాల్సి ఉండగా, 20 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇక మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులన్నింటిలోనూ బీసీలకు అన్యాయమే జరిగింది. అందుకే కులగణనపై ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. లేకుంటే త్వరలోనే బీసీ జనసభ, వివిధ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.
– డి.రాజారాం యాదవ్, బత్తుల సిద్దేశ్వర్లు, కరుణాకర్ ముదిరాజ్, లొడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, మేకల కృష్ణ, కొంగర నరహరి, కొంపెల్లి రాజు, బొడ్డుపల్లి లింగం, భారి అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

