సంక్షోభం దిశగా సాగు రంగం
‘మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చేదిరిపోయిన నాడు, మళ్లీ పాత తెలంగాణ లాగ తయారైతం, బతుకులు ఆగమైతయ్, మోసపోతే గోసపడుతం, చెప్పడం నా బాధ్యత’ అంటూ 2023 ఎన్నికల సమయంలో ప్రజలకు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో తెలియజెప్పారు. నేడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన మాటలు నిజమని నిదర్శనాలతో స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్నది. రైతులు అరిగోస పడుతున్నారు. ‘ఆనాటి రోజులు తెస్తాను’ అంటూ పాటరూపంలో చెప్తూ రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే ఆనాటి కాంగ్రెస్ పాలనలోని చీకటి రోజులను తెచ్చారు.
తెలంగాణలో రైతుల దుస్థితి చూస్తుంటే అత్యంత దయనీయంగా కనబడుతున్నది. ఎల్ నినో ప్రభావం ఉంటుందని కొన్ని నెలల ముందే శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అలాంటప్పుడు బాధ్యత కలిగిన పాలకులు ఎవరైనా ఏం చేస్తారు? కరువు ప్రభావం ప్రజలు, రైతులపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. కానీ కాంగ్రెస్ పాలకులు ఆ పని చేయలేదు. అజ్ఞానపు విధానాలతో రైతులకు కష్టకాలం తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ మీద అక్కసుతో నీళ్లు కిందకు వదిలారు. తన గురువు చంద్రబాబుకు నీళ్లను దారాదత్తం చేశారు రేవంత్రెడ్డి.
ఏపీలో లేని కరువు తెలంగాణలోనే ఎందుకు వచ్చింది? చంద్రబాబు కుప్పంనకు కృష్ణా నీళ్లను తరలించుకుపోతుంటే రేవంత్రెడ్డి ఏం చేస్తున్నట్టు? రైతులకు మరణ శాసనం రాస్తున్నారా? గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులకు గ్యారెంటీ లేకుండా పోయింది. జూరాల నీళ్ల కోసం పోరాడిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నది ఈ దుర్మార్గపు సర్కార్. నీటి పరిస్థితి ఇలా ఉంటే.. కరెంటు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రైతులకు సరైన కరెంటు ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది.
కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన కరెంటు నేడు కనీసం 7 గంటలు కూడా రావడంలేదు. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బొగ్గు కొరత, విద్యుత్తు కోతలు ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలకు నిదర్శనం. ఏది అడిగినా ఎల్ నినో ఎఫెక్ట్ అంటూ తప్పించుకు తిరుగుతున్నారు మంత్రులు. బొగ్గు నిల్వలు ఏర్పాటు చేసుకోకపోవడం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కరువును ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేంటో సీఎం, మంత్రులు సమాధానం చెప్పగలరా? చివరకు చేతులెత్తేసి ‘కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, పంటలు వేసుకుంటే నష్టపోతారు’ అంటూ రైతులను బెదిరించడమే పాలననా? మరోవైపు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే పాలకులు ఢిల్లీ, గోవా యాత్రలతో కాలం వెళ్లదీస్తున్నారు. రేవంత్రెడ్డికి రైతులంటే అంత చులకనా..?
రాష్ట్రంలో పూర్తి నిర్లక్ష్య పాలన సాగుతున్నది. రైతుబంధు జాడలేదు, రైతు బీమా ఊసే లేదు. ప్రతిపక్ష నేతల మీద ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలు, డైవర్షన్ డ్రామాలు తప్ప రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసింది. కేసీఆర్ పాలనలో అద్భుతంగా సాగిన సాగు నేడు అత్యంత సంక్షోభంలో కూరుకుపోయింది. కరువు వచ్చిన కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసుకునే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు.
కానీ కాంగ్రెస్ పాలకుల అవగాహనరాహిత్యంతో లక్షల ఎకరాల్లో పంటలను పడావు పెట్టారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండించాల్సిన రైతులు నేడు సబ్ స్టేషన్ల వద్ద, ప్రాజెక్టుల వద్ద ధర్నాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. రైతులంతా నేడు కేసీఆర్ను తలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో సంతోషంగా సాగిన సాగు, నేడు సంక్షోభం దిశగా పయనించడం తెలంగాణ భవిష్యత్తుకు ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ట పాలనకు ప్రజలు గట్టి సమాధానం చెప్పాలి. అవకాశం ఎప్పుడు వచ్చినా ఓటు ద్వారా తరిమికొట్టాలి.
– తెలంగాణ విజయ్ 94919 98702
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

