కరువు వేళ చేతులెత్తేసిన సర్కార్
కరువు హెచ్చరికల వేళ ప్రభుత్వం చేతులెత్తేయడం కాదు..నీటి వినియోగ ప్రాధాన్యతలను పునఃసమీక్షించాల్సిన సమయం ఇది! ‘ఎల్ నినో వస్తున్నది. తాగడానికే నీళ్లు లేవు. సాగుకు చుక్కనీరు ఇవ్వలేం. కరెంట్ లేదు. సాగుబడి ఆపండి. ఏసీలు బంద్ చేసుకోండి.
కరువు హెచ్చరికల వేళ ప్రభుత్వం చేతులెత్తేయడం కాదు..నీటి వినియోగ ప్రాధాన్యతలను పునఃసమీక్షించాల్సిన సమయం ఇది! ‘ఎల్ నినో వస్తున్నది. తాగడానికే నీళ్లు లేవు. సాగుకు చుక్కనీరు ఇవ్వలేం. కరెంట్ లేదు. సాగుబడి ఆపండి. ఏసీలు బంద్ చేసుకోండి. ఇంట్లో కూర్చోండి’..కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో వ్యవసాయ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గవచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవచ్చు. విద్యుత్తు కొరత కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ ప్రభుత్వానికి సవాళ్లే. కానీ, ఈ సవాళ్లను ఎదుర్కొనే బాధ్యత కూడా సర్కార్‌దే కదా!
వర్షాలు పడకపోతే రైతు ఏం చేయాలి? సాగునీరు లేకపోతే పంటలు ఎలా పండించాలి? విద్యుత్తు సరఫరా లేకపోతే బోర్లు ఎలా నడపాలి? వ్యవసాయం ఆపేయమని చెప్పడం సులభమే. కానీ, వ్యవసాయాన్ని నమ్ముకున్న లక్షలాది కుటుంబాల జీవనాధారం ఏమిటి? కరువు ముంచుకొస్తున్నప్పుడు రైతులకు ధైర్యం చెప్పాల్సిన..ప్రత్యామ్నాయాలను చూపాల్సిన, ముందస్తు ప్రణాళికతో రంగంలోకి దిగాల్సిన ప్రభుత్వం.. ‘సాగు ఆపండి, ఇంట్లో కూర్చోండి’ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నీటి కొరత ఉందంటే..అందుబాటులో ఉన్న నీటిని ఎవరికి, ఎంత, ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నామన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే మొదట ప్రభావితమయ్యేది వ్యవసాయమే. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు.
అప్పులు చేసి బోర్లు వేస్తారు. డీజిల్ మోటర్లు నడుపుతారు. అయినా నీరు అందక పంటలు ఎండిపోతే..వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయానికి నీటి సరఫరా సాధ్యం కాదని ప్రకటించే ముందు..రాష్ట్రంలో నీటి వినియోగంపై సమగ్ర సమీక్ష జరపాలి. వ్యవసాయానికి నీరు ఇవ్వలేమని చెప్పే ప్రభుత్వం..పరిశ్రమలకు నీటి సరఫరా విషయంలోనూ అదే కఠినమైన సమీక్ష ఎందుకు చేయకూడదు? తీవ్రమైన నీటి కొరత ఏర్పడినప్పుడు వాటి నీటి వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగాన్ని తప్పనిసరి చేయడం, తాత్కాలికంగా ఉత్పత్తిని పరిమితం చేయడం వంటి చర్యలను పరిశీలించకూడదా?
నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. అందుబాటులో ఉన్న నీటిని పలు ప్రాధాన్యతలతో వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలి.మొదట ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలి. ఆ తర్వాత పశువుల తాగునీరు, పంటలను కాపాడేందుకు అవసరమైన కీలక సాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయానికి నీటిని అందించే అవకాశాలను పరిశీలించిన తర్వాతే పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులను సమీక్షించాలి.
నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే పారిశ్రామిక నీటి సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించాలి. కేవలం నీటి కేటాయింపులపై చర్చించడం సరిపోదు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.
1. జలాశయాల నీటి నిల్వలపై సమగ్ర సమీక్ష: రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా, చిన్న జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను అంచనా వేయాలి. తాగు, సాగునీటి అవసరాలు, భవిష్యత్తులో వర్షపాతం అంచనాలను పరిగణనలోకి తీసుకుని నీటి వినియోగ ప్రణాళికను రూపొందించాలి. 2. సాగునీటి సరఫరాకు అత్యవసర ప్రణాళిక: నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలను పూర్తిగా ఎండిపోకుండా కాపాడేందుకు అవసరమైన మేరకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలి. పంటల దశను బట్టి కీలకమైన నీటి తడులను అందించేందుకు ప్రణాళిక రూపొందించాలి. 3. వ్యవసాయ విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక దృష్టి: విద్యుత్తు కొరత ఉందని వ్యవసాయానికి సరఫరాను నిలిపివేయడం కాకుండా..అందుబాటులో ఉన్న విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించేలా షెడ్యూల్ ప్రకటించాలి. రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి.4. పంట నష్టపరిహారం, ప్రత్యామ్నాయ పంటలు: నీరు అందక పంటలు నష్టపోయే పరిస్థితుల్లో రైతులకు తక్షణ సాయం అందించాలి. ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో పండే పంటలపై వ్యవసాయ శాఖ ద్వారా సలహాలు ఇవ్వాలి. పంటల మార్పిడికి అవసరమైన విత్తనాలు, ఆర్థిక సాయం అందించాలి. 5. నీటి సంరక్షణకు గ్రామస్థాయి ప్రణాళిక: చెరువులు, కుంటలు, వాగులు, కాలువల్లో పూడికతీత చేపట్టాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకునే నిర్మాణాలను బలోపేతం చేయాలి. భూగర్భజలాల పెంపునకు గ్రామస్థాయి కార్యాచరణ రూపొందించాలి. పరిశ్రమలు కూడా నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి. ఇథనాల్ పరిశ్రమలు, బీర్ల తయారీ కేంద్రాలు, ఏఐ డాటా సెంటర్లు, ఇతర నీటి ఆధారిత పరిశ్రమలు నీటి పునర్వినియోగాన్ని పెంచాలి. శుద్ధి చేసిన వ్యర్థజలాలను సాధ్యమైన చోట్ల పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలి. పరిశ్రమలకు నీటి సరఫరా చేసే వనరులపై పారదర్శకత ఉండాలి. ప్రతి పరిశ్రమ ఎంత నీటిని వినియోగిస్తున్నది? ఎంత నీటిని పునర్వినియోగం చేస్తున్నది? నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది? అనే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పరిశ్రమలకు నీటి కేటాయింపులు చేసినప్పుడు వాటి ప్రభావం స్థానిక ప్రజలు, రైతులపై ఎలా ఉంటుందో అంచనా వేయాలి.
వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నదని తెలిసినప్పుడు నీటి నిల్వలను కాపాడుకోవడం, నీటి వినియోగాన్ని నియంత్రించడం, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, సాగునీటి అవసరాలను అంచనా వేయడం వంటి చర్యలు చేపట్టాలి. రైతులకు సాగు ఆపేయాలని చెప్పడం కంటే..తక్కువ నీటితో సాగు చేసే మార్గాలను చూపించాలి. నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలి. వ్యవసాయం కొనసాగించే అవకాశాలను అన్వేషించాలి. నీరు లేకపోతే వ్యవసాయం కష్టమే.
కానీ, నీటి కొరతను ఎదుర్కొనేందుకు రైతులను ఒంటరిగా వదిలేయడం పరిష్కారం కాదు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయానికి అవసరమైన నీటిని కేటాయించాలి. పరిశ్రమల నీటి వినియోగాన్ని సమీక్షించాలి. నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలి. కరువు ప్రభావిత రైతులకు తక్షణ సాయం అందించాలి. కరువు సమయంలో నీటి పంపిణీలో తీసుకునే నిర్ణయాలు మాత్రం ప్రభుత్వ బాధ్యత. రైతు పొలంలో పంట ఎండిపోతే అది ఒక్క రైతు నష్టమే కాదు. రాష్ట్ర ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన నష్టం. నీటిని కాపాడటం అంటే రైతును కాపాడటం. రైతును కాపాడటం అంటే రాష్ట్ర భవిష్యత్తును కాపాడటం
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
పంట నష్టపరిహారం, ప్రత్యామ్నాయ పంటలు: నీరు అందక పంటలు నష్టపోయే పరిస్థితుల్లో రైతులకు తక్షణ సాయం అందించాలి. ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో పండే పంటలపై వ్యవసాయ శాఖ ద్వారా సలహాలు ఇవ్వాలి. పంటల మార్పిడికి అవసరమైన విత్తనాలు, ఆర్థిక సాయం అందించాలి. నీటి సంరక్షణకు గ్రామస్థాయి ప్రణాళిక: చెరువులు, కుంటలు, వాగులు, కాలువల్లో పూడికతీత చేపట్టాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకునే నిర్మాణాలను బలోపేతం చేయాలి.
-శ్యాంమోహన్ ,9440595858
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
Mahesh Kumar Goud| నా మాట ఎవరూ వినట్లే .. నేనేం చేయాలి.. ఏఐసీసీకి మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ
Revanth Reddy | పర్సంటేజీల వేట పాలమూరుపై ఊగిసలాట.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు శాపంగా రేవంత్ సర్కార్
కరువు వేళ చేతులెత్తేసిన సర్కార్
Drought Relief | రైతన్నకు రేవంత్ సర్కార్ మరోసారి మొండిచెయ్యి.. కరువు సాయం ఎగవేతే!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

