చావుదలకు లావుదుఃఖం అన్నట్టు ఈ వయస్సులో ఇదేం కెమిస్ట్రీ కడియం శ్రీహరి. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేకున్నా, నువ్వు ఏనాడూ ‘జై తెలంగాణ’ అని అనకున్నా, తెలంగాణ కోసమే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిడ్డపై నువ్వు చంద్రబాబు తొత్తుగా బరిలో దిగినా నేను ఓపిక పట్టిన. ‘ఆనాడు తెలంగాణవాదులు నా కాలిగోటికి సరిపోరు’ అని అహంకారంతో మాట్లాడినా ఓపిక పట్టిన. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకొంటే ‘సరే పోనిలే’ అనుకొని అక్కున చేర్చుకున్న. నా గడ్డమీద (స్టేషన్‌ఘన్‌పూర్) పుట్టిన బిడ్డవు కాకపోయినా నిన్ను నేను గుండెలకు అద్దుకున్న.
గులాబీ కండువా కప్పుకొని నువ్వు తిరుగుతుంటే నా ఇల్లిల్లూ నీకు హారతిపట్టింది కదా బిడ్డ! తెలంగాణ వచ్చినంక.. నువ్వు చాలా తెలివికల్లోనివని.. బుద్ధిమంతుడవని కేసీఆర్ నీకు ఎంపీ టికెట్ ఇస్తే నేను కండ్ల పండుగ లెక్క చూసుకున్న. మంచి మెజారిటీ ఇచ్చిన. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి ఇగురమంతుడు, అనుభవశాలి కావాలని కేసీఆర్ ఎంపీగా ఉన్న నిన్ను ఢిల్లీ నుంచి పిలిపించి ఎమ్మెల్యే కాకపోయినా.. ఎమ్మెల్సీ కాకపోయినా ముఖ్యమంత్రి తర్వాత పెద్ద పోస్టు అయిన ఉపముఖ్యమంత్రి పదవి నీకు ఇచ్చారు. అప్పుడు నా గుండె ఉప్పొంగింది. ఆ తర్వాత నిన్ను కేసీఆర్ ఒక్కసారి కాదు, రెండు సార్లు ఎమ్మెల్సీని చేసిండు. ఎమ్మెల్సీగా ఉన్నా.. ఎమ్మెల్యే అయ్యావు. అదెలా అయ్యావో నాకు తెలుసు. నీకు తెలుసు బిడ్డా. అసెంబ్లీ ఎన్నికల ముందు ‘కాంగ్రెస్‌లో చేరుతా’ అని లీకులు ఇస్తే కేసీఆర్ నీ అనుభవశాలితనం అవసరం అని ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మళ్లీ గెలిపించాను. ఈ గడ్డ నుంచే నువ్వు అన్ని రకాల పదవులు వెలగబెట్టినవు బిడ్డ! ఎంపీ, ఉపముఖ్యమంత్రి, రెండుసార్లు ఎమ్మెల్సీ, మొన్నటికి మొన్న ఎమ్మెల్యే.. ఇన్ని పదవులు ఇచ్చినా నీకు అధికార యావ చావలేదాయె.
నీ అతి అనుభవశాలితనంతో.. ముందుజాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీలో నీ బిడ్డకు పోటీగా ఎవరూ ఉండొద్దని ఒక్కొక్కరిని ఒక్కొక్కరినీ బయటకు పంపిస్తివి. అయినా ఓపికపట్టినం. గులాబీ జెండా నీడల్నే ఉన్నడు, తండ్రి అయినా, బిడ్డ అయినా సరే పార్టీ నిర్ణయించిందని ఆఖరికి నీ బిడ్డ గెలుపు కోసం నా గడ్డ మీదున్న ప్రతీ బిడ్డా కష్టపడి పనిచేస్తుంటే, దిక్కూ దివాణం లేక ఇంట్ల ఉంటే నీకు అన్ని పదవులు ఇచ్చి అక్కున చేర్చుకుంటే.. ఉన్నట్టు ఉంటే ఏమైంది? చావుదలకు లావు దుఃఖం అన్నట్టు ఈ వయసులో ఇదేం పోయేకాలం బిడ్డా శ్రీహరి.
నీకు అధికారమే కావాలంటే.. అధికారం ఉన్న పార్టీలో చేరాలనుకుంటే నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వకముందే వద్దూ అనకపోయినవు? అప్పుడు నిన్నెవరు వద్దన్నరు శ్రీహరి? ముసలితనానికి కుసుమ గుడాలు అన్నట్టు ఈ వయసులో ఇదేం మోసం, ఇదేం ద్రోహం కడియం శ్రీహరి? తుచ్ఛమైన సంపద కోసం, అధికారం కోసం ఇంత యావ ఎందుకు శ్రీహరి? అయినా… కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వేమన్నవో టీవీ ఇంటర్వ్యూలల్ల యాజ్జేసుకో.
బిడ్డా కడియం శ్రీహరి! నీవు ఇప్పుడు నాకు ఎడబాసిన బిడ్డవు. యెదమీద తన్నిన గునపానివి. నిన్ను నేనే కాదు, ఏ తల్లీ.. ఏ బిడ్డా.. క్షమించదుగాక క్షమించదు.
-ఇట్లు
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం